IND Vs SA 3rd T20 : దంచికొట్టిన తిలక్ వర్మ.. ఉత్కంఠ పోరులో భారత్ సూపర్ విక్టరీ
సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది.
దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (107) సెంచరీతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు చేసింది. సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(107) అజేయ సెంచరీతో రాణించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఆఫ్ సైడ్ కళ్లు చెదిరే సిక్సులతో అర్థ శతకం నమోదు చేశాడు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు తొలుత తడబడ్డారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ విజయం లాంఛనమే అనుకున్న సమయంలో మార్కొ జాన్సెన్ భారత్‌ను భయపెట్టాడు. కేవలం 17 బంతుల్లో 54 పరుగులు చేసి చివరి ఓవర్ వరకు పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. క్లాసెన్ 41 పరుగులతో రాణించాడు. సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. దీంతో భారత్ 11 పరుగులతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకుని రాణించారు.
సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు..
ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2010 టీ20 వరల్డ్ కప్‌లో సురేష్ రైనా ఈ రికార్డును అధిగమించాడు. సురేష్ రైనా 23 ఏళ్ల(156రోజులు)లో ఈ ఫీట్ సాధించగా తిలక్ వర్మ 22 ఏళ్ల(4 రోజులు)కే ఈ రికార్డు సాధించాడు.టీ20ల్లో భారత్ తరఫున అతి పిన్న వయసులో (22 ఏళ్ల 4 రోజులు) సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు జైస్వాల్ (21 ఏళ్ల 279 రోజులు) నేపాల్‌పై ఆసియా గేమ్స్‌లో సెంచరీ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ కొట్టిన తొలి తెలుగు ప్లేయర్‌గా, తిలక్ వర్మ నిలిచాడు.