IND vs PAK : షమీకి ఏమైంది?.. గాయం తిరగబెట్టిందా?
పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ చీలమండల గాయంతో ఇబ్బందిపడ్డాడు.

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరమవడంతో భారత బౌలింగ్ దళం బాధ్యత మహ్మద్ షమీపైన పడింది. గాయం నుంచి కోలుకుని తిరిగి ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత షమీ ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. అతని సామర్థ్యంపై సందేహం లేనప్పటికీ.. ఫిట్‌నెస్‌పై మాత్రం అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో షమీ అదరగొట్టాడు. ఐదు వికెట్లు తీసి అనుమానలన్నింటినీ పటాపంచలు చేశాడు. అతని ఫిట్‌నెస్‌పై అనుమానాలు తొలిగిపోయాయని అనుకునే లోపే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతను ఇబ్బందిపడుతూ కనిపించాడు.
కుడి మోకాలి నొప్పితో బాధపడ్డాడు. ఆరంభంలో కాస్త అసౌకర్యంగా కనిపించాడు. తొలి ఓవర్ వేసిన అతను ఏకంగా ఐదు వైడ్‌లు ఇచ్చాడు. ఓవర్ పూర్తి చేయడానికి 11 బంతులు తీసుకున్నాడు. దీంతో వన్డేల్లో ఓవర్ పూర్తి చేయడానికి ఎక్కువ బంతులు తీసుకున్న బౌలర్‌గా షమీ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఇక, 5వ ఓవర్ వేస్తుండగా అతను చీలమండలం నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఫిజియో వచ్చి మసాజ్ చేసిన తర్వాత షమీ ఆ ఓవర్‌ను పూర్తి చేశాడు. ఆ వెంటనే అతను మైదానం వీడగా.. వాషింగ్టన్ సుందర్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.
అయితే, కాసేపటికే షమీ తిరిగి మైదానంలోకి రావడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. అతను పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ తీసుకుని వచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఘటనతో షమీ ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఎక్కువయ్యాయి. వన్డే వరల్డ్ కప్-2023 తర్వాత షమీ కుడి చీలమండలం గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. దీంతో అతను దాదాపు ఏడాదికిపైగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చీలమండల గాయం తిరగబెట్టిందేమోనన్న సందేహం కలుగుతుంది. అదే జరిగితే చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు భారీ ఎదురుదెబ్బే. ఇప్పటికే బుమ్రా దూరమవ్వగా.. షమీ కూడా దూరమైతే బౌలింగ్ దళం బలహీనమవుతుంది. షమీ ఫిట్‌నెస్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.