భారత్ హ్యాట్రిక్.. బాస్కెట్‌బాల్ ఆసియా కప్‌లో మెయిన్ డ్రాకు అర్హత
బాస్కెట్‌బాల్ 3x3 ఆసియా కప్‌లో భారత పురుషుల జట్టు మెయిన్ డ్రాకు అర్హత సాధించింది.

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్‌లో జరుగుతున్న బాస్కెట్‌బాల్ 3x3 ఆసియా కప్‌లో భారత పురుషుల జట్టు మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో వరుసగా మూడు విజయాలు సాధించి టోర్నీలో ముందడుగు వేసింది. రెండేళ్ల తర్వాత ఆసియా కప్‌లో మెయిన్ డ్రాకు చేరుకుంది. గురువారం జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో భారత్ తన కంటే మెరుగైన ర్యాంకర్ అయిన ఫిలిప్సీన్స్‌ను ఓడించింది. 21-11 తేడాతో విజయం సాధించింది. హర్ష్ దగర్ 10 పాయింట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రణవ్ ప్రిన్స్ కూడా 6 పాయింట్లతో సత్తాచాటాడు. తొలి రెండు గ్రూపు మ్యాచ్‌ల్లో సౌత్ కొరియా, మకావులపై విజయం సాధించింది. మెయిన్ డ్రాకు అర్హత సాధించిన భారత్.. ప్రిలిమినరీ రౌండ్‌లో చైనా, చైనీస్ తైపీతో ఆడనుంది.
మహిళల జట్టు విజయంతో
ఆసియా కప్‌లో భారత మహిళల జట్టు తమ పోరాటాన్ని విజయంతో ముగించింది. తొలి రెండు గ్రూపు మ్యాచ్‌ల్లో పరాజయం పాలై మెయిన్ డ్రాకు అర్హత సాధించే ఆశలను గల్లంతు చేసుకుంది. ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో గువామ్‌పై 21-12 తేడాతో విజయం సాధించింది. శ్రీకళా రాణి 13 పాయింట్లతో మెరిసి భారత జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది. భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో హాంకాంగ్, చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయింది.