IPL 2025 : ఐపీఎల్‌కు బుమ్రా మరో రెండు వారాలు దూరం?
ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఐపీఎల్‌లో ఎప్పుడు పాల్గొంటాడన్నది అనిశ్చితి నెలకొంది.
దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఐపీఎల్‌లో ఎప్పుడు పాల్గొంటాడన్నది అనిశ్చితి నెలకొంది. ఆస్ట్రేలియా టూరులో వెన్ను గాయం బారిన పడిన అతను ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తున్నది. ఇప్పటికే ఐపీఎల్‌లో అతను రెండు మ్యాచ్‌లు కోల్పోయాడు. అయితే, బీసీసీఐ బుమ్రాకు ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇవ్వలేదు. అతను ఇంకా రెండు వారాలు ఐపీఎల్‌కు దూరం కానున్నట్టు తెలుస్తోంది.
‘అతను బాగానే కోలుకుంటున్నాడు. కానీ, బుమ్రా ఎప్పుడు పునరాగమనం చేస్తాడనేది చెప్పలేం. అతను మెల్లగా తన పనిభారాన్ని పెంచుకుంటున్నాడు. బుమ్రా తిరిగి రావడానికి మరో రెండు వారాలు పట్టొచ్చు. ఏప్రిల్ రెండో వారం లేదా మూడో వారంలో అతను 100 శాతం ఫిట్‌నెస్ సాధిస్తాడని అనుకుంటున్నాం. ఇది ప్రస్తుత అంచనా మాత్రమే. కచ్చితంగా చెప్పలేం.’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా బుమ్రా ఎన్‌సీఏలో బౌలింగ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో అతను బాగానే బౌలింగ్ చేశాడు. ఇబ్బందిపడినట్టు కనిపించలేదు.
అయితే, అతను ఎప్పుడు తిరిగిస్తాడనే దానిపై బీసీసీఐ గానీ, ఎన్‌సీఏగానీ స్పష్టత ఇవ్వడం లేదు. జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు కూడా అందుబాటులో ఉంటాడా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అతని విషయంలో బోర్డు రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నది. అతను 100 శాతం మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే ఎన్‌సీఏ క్లియరెన్స్ ఇస్తుందని తెలుస్తుంది. మరోవైపు, లీగ్‌లో ముంబై జట్టులో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. బ్యాటర్ల పేలవ ప్రదర్శనకు తోడు బుమ్రా లాంటి మ్యాచ్ విన్నింగ్ బౌలర్ లేకపోవడంతో ముంబైకి చేటు చేస్తున్నది.