నేడు సెలెక్షన్ కమిటీ మీటింగ్?.. ఇంగ్లాండ్‌తో మిగతా సిరీస్‌కు జట్టును ప్రకటించే అవకాశం
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మిగతా మూడు టెస్టులకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ నేడు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా 28 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడింది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు జరగనుంది. అయితే, ఐదు టెస్టుల సిరీస్‌లో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ తొలి రెండు టెస్టులకే భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా మూడు మ్యాచ్‌లకు జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. నేడు సెలెక్షన్ కమిటీ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. మీటింగ్ అనంతరం మిగతా మూడు టెస్టులకు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. రెండు, మూడు మార్పులతో అదే జట్టును సెలెక్షన్ కమిటీ ప్రకటించనున్నట్టు తెలిసింది.
కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. మరి, వీరిని మిగతా సిరీస్‌కు ఎంపిక చేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే, గాయం కారణంగా మహ్మద్ షమీ తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు. అతనికి ఇంకా నేషనల్ క్రికెట్ అకాడమీ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇవ్వలేదని సమాచారం. ప్రస్తుతం అతను లండన్‌లో ఉండటంతో అతన్ని ఎంపిక చేయకపోవచ్చు. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ మిగతా సిరీస్‌కు అందుబాటులో ఉండే చాన్స్ ఉంది. అయితే, సెలెక్షన్ కమిటీ మీటింగ్ తర్వాతే కోహ్లీపై స్పష్టత రానుంది. మరోవైపు, గతేడాది వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత సీనియర్ ఆటగాడు చతేశ్వర్ పుజారా టెస్టు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో పుజారా సత్తాచాటుతున్నాడు. మరి, మిగతా సిరీస్‌కు అతన్ని ఎంపిక చేస్తారా?లేదా? అన్నది చూడాలి.