ఆ రికార్డును సమం చేసిన అశ్విన్.. మిగతా వారు దరిదాపుల్లో కూడా లేరు
టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో భారత్ తరపున అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. కుంబ్లే 35 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. తాజాగా అశ్విన్ సైతం 35వ సారి ఐదు వికెట్లు తీసుకున్నాడు. నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అండర్సన్ వికెట్ తీయడంతో అశ్విన్ ఈ ఘనత సాధించాడు. మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్(25 సార్లు), కపిల్ దేవ్(23 సార్లు), బీఎస్ చంద్రశేఖర్(16) వీరి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఐదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో ప్రస్తుత బౌలర్లలో అశ్విన్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. జడేజా 13సార్లు ఈ ప్రదర్శన చేయగా.. బుమ్రా 10 సార్లు ఐదు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ 6 సార్లు ఈ ఘనత అందుకున్నాడు. అశ్విన్ మరో రికార్డును కూడా సాధించాడు. ఇంగ్లాండ్‌పై అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భారత బౌలర్‌గా అవతరించాడు. ఇంగ్లాండ్‌పై అతను 7సార్లు ఈ ప్రదర్శన చేశాడు. అశ్విన్ తర్వాత మాజీ దిగ్గజ బౌలర్ భగవత్ చంద్రశేఖర్(6 సార్లు) రెండో స్థానంలో ఉండగా.. అనిల్ కుంబ్లే, అక్షర్ పటేల్ చెరో 4 సార్లు ప్రదర్శన చేసి మూడో స్థానాన్ని పంచుకున్నారు.