నాలుగు టెస్టులో నలుగురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి..?
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉన్నది. రాంచీ వేదికగా శుక్రవారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉన్నది. రాంచీ వేదికగా శుక్రవారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న టీమ్ ఇండియా.. రాంచీలోనే సిరీస్‌లో పట్టేయాలని పట్టుదలతో ఉన్నది. అందుకు తగ్గ ప్రణాళికలతో రోహిత్ సేన సిద్ధమవుతున్నది. అయితే, నాలుగో టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. గత మ్యాచ్‌ల్లో బౌలింగ్ దళాన్ని ఒంటిచెత్తో మోసిన బుమ్రా నాలుగో టెస్టుకు దూరంగా ఉండటం భారత జట్టుకు లోటే. కాబట్టి, అతని గైర్హాజరుతో భారత బౌలింగ్ దళం కూర్పుపై ఆసక్తి నెలకొంది. రాంచీ టెస్టులో టీమ్ మేనేజ్‌మెంట్ అతని స్థానాన్ని ఎవరుతో భర్తీ చేస్తుందో అన్న చర్చ జరుగుతుంది. మరోవైపు, నాలుగో టెస్టులో భారత్ పూర్తిగా స్పిన్నర్లనే నమ్ముకుంటుందని ప్రచారం జరుగుతుంది.
పిచ్‌ను ఫాలో అవుతారా?
సిరీస్‌లో గత మూడు మ్యాచ్‌లను పరిశీలిస్తే భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో ఆడింది. అయితే, గత మ్యాచ్‌లు ఆడిన పిచ్‌లతో పోలిస్తే రాంచీ పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్టు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ సైతం ఇదే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. రాంచీ పిచ్ స్పిన్ ఫ్రెండ్లీగా ఉందని, భారత్ తమ స్పిన్ దళాన్ని పూర్తిగా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. రవీంద్ర జడేజా, అశ్విన్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు ప్రధాన స్పిన్ అస్త్రాలు. కుల్దీప్ యాదవ్ కూడా ఫామ్‌లో ఉండటం భారత్‌కు సానుకూలంశం. నాలుగో టెస్టులో ఈ త్రయం ఆడటం ఖాయమే. ఒకవేళ నాలుగో స్పిన్నర్‌ను తీసుకోవాలనుకుంటే అక్షర్ పటేల్ జట్టులోకి వస్తాడు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన అతను 5 వికెట్లు పడగొట్టాడు.
పేసర్‌నే తీసుకోవాలనుకుంటే?
గత మూడు మ్యాచ్‌ల్లో ఉపయోగించిన పిచ్‌లు కూడా స్పిన్ ఫ్రెండ్లీనే. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై బుమ్రా సత్తాచాటాడాన్ని చూశాం. రాజ్‌కోట్‌లో సిరాజ్ 4 వికెట్లతో రాణించాడు. కాబట్టి, ఈ మ్యాచ్ కూడా ఇద్దరు పేసర్లను జట్టులో ఉంచుకునేలా టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన చేయొచ్చు. బుమ్రా గైర్హాజరులో బౌలింగ్ దళాన్ని సిరాజ్ నడిపించనున్నాడు. మరో పేసర్ స్థానం కోసం ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్ పోటీపడుతున్నారు. సిరాజ్ గైర్హాజరులో రెండో టెస్టు ఆడిన ముకేశ్ అంచనాలను అందుకోలేకపోయాడు. కేవలం ఇక్క వికెట్ మాత్రమే తీశాడు. అయితే, మూడో టెస్టుకు దూరంగా ఉన్న అతను రంజీ ట్రోఫీలో మెరిశాడు. బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించిన ముకేశ్.. బిహార్‌తో మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు తీసుకున్నాడు. కాబట్టి, టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి మరో అవకాశం ఇవ్వాలని చూడొచ్చు. మరోవైపు, ఆకాశ్ దీప్ అరంగేట్రాన్ని కొట్టిపారేయలేం. మరి, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఏ విధంగా బౌలింగ్ కూర్పు చేస్తారో చూడాలి.