IND VS AUS 2nd ODI: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఆసీస్‌ యువ పేసర్‌..

Update: 2023-09-24 17:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండోర్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్‌ యువ పేసర్‌ కెమరూన్‌ గ్రీన్‌ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌల్‌ చేసిన గ్రీన్‌ రికార్డు స్థాయిలో 103 పరుగులు సమర్పించుకుని, వన్డేల్లో ఆసీస్‌ తరఫున మూడో చెత్త బౌలింగ్‌ గణాంకాలను (పరుగుల పరంగా) నమోదు చేశాడు. 2006లో జోహనెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ బౌలర్‌ మిక్‌ లెవిస్‌ సమర్పించుకున్న 113 పరుగులు వన్డేల్లో ఆసీస్‌ తరఫున అత్యంత చెత్త బౌలింగ్‌ ప్రదర్శన కాగా.. కొద్ది రోజుల కిందట అదే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడమ్‌ జంపా కూడా 113 పరుగులు సమర్పించుకుని ఆసీస్‌ తరఫున రెండో చెత్త బౌలింగ్‌ ప్రదర్శనను నమోదు చేశాడు.

తాజాగా గ్రీన్‌ భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 103 పరుగులు సమర్పించుకుని వన్డేల్లో ఆసీస్‌ తరఫున మూడో చెత్త బౌలింగ్‌ ప్రదర్శనను నమోదు చేశాడు. వన్డేల్లో ఆసీస్‌ తరఫున ఓ ఇన్నింగ్స్‌లో 100 అంతకంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్లు మొత్తం నలుగురు కాగా.. వారిలో మిక్‌ లెవిస్‌, ఆడమ్‌ జంపా, కెమరూన్‌ గ్రీన్‌, ఆండ్రూ టై (100) ఉన్నారు. ఇవాల్టి మ్యాచ్‌లో గ్రీన్‌ 2 వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వన్డేల్లో భారత్‌పై అత్యంత చెత్త ప్రదర్శనల్లో గ్రీన్‌ ఇవాల్టి మ్యాచ్‌ ప్రదర్శన (2/103) మూడో స్థానంలో నిలిచింది.


Similar News