తెలుగు కుర్రాడు భరత్‌కు చోటు దక్కేనా?.. రాజ్‌కోట్ టెస్టుకు తుది జట్టులో స్థానంపై అనుమానాలు

తెలుగు కుర్రాడు, వికెట్ కీపర్ కేఎస్ భరత్‌‌ భారత జట్టులో చోటు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Update: 2024-02-13 16:49 GMT

దిశ, స్పోర్ట్స్ : తెలుగు కుర్రాడు, వికెట్ కీపర్ కేఎస్ భరత్‌‌ భారత జట్టులో చోటు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతకాలంగా అతను ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులో దారుణంగా నిరాశపరిచి జట్టులో చోటును సంక్లిష్టం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో టెస్టులో తుది జట్టులో అతనికి చోటు దక్కడంపై అనుమానాలు నెలకొన్నాయి. మరి, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ అతనికి మరో అవకాశమిస్తారో లేదో చూడాలి.

టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్ కేఎస్ భరత్‌‌‌ను తీర్చిదిద్దడం మొదలుపెట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా అరంగేట్రం చేశాడు. పరిమిత ఓవర్లలో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌ కీపింగ్ బాధ్యతలు చూసుకున్నా.. టెస్టుల్లో మాత్రం భరత్‌‌ వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్‌తో పర్యటనకు ముందు కూడా కేఎల్ రాహుల్, కేఎస్ భరత్‌లలో ఎవరిని వికెట్ కీపర్‌గా తీసుకుంటారోనని చర్చ జరిగిందే. అయితే, టీమ్ మేనేజ్‌మెంట్ భరత్ వైపే మొగ్గుచూపింది. కానీ, భరత్ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తడబడుతున్నాడు. హైదరాబాద్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ క్రీజులో పాతుకపోయినట్టే కనిపించిన అతను 28 పరుగులకే వెనుదిరిగాడు. ఇక, సొంతగడ్డపై జరిగిన రెండో టెస్టులో దారుణంగా నిరాశపరిచాడు. వరుసగా 17, 6 పరుగులు చేశాడు. మొత్తంగా 12 ఇన్నింగ్స్‌ల్లో 20.09 సగటుతో 221 పరుగులే చేశాడు. అందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. ఆస్ట్రేలియాపై చేసిన 44 పరుగులు అతని టాప్ స్కోర్.

ధ్రువ్ జురెల్‌తో పోటీ

భరత్ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో మూడో టెస్టులో అతనికి చోటు దక్కడంపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు, బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపికైన ధ్రువ్ జురెల్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. మూడో టెస్టు కోసం ధ్రువ్ జురెల్ నుంచి భరత్ గట్టిపోటీ ఎదుర్కొంటున్నాడు. ‘భరత్ బ్యాటుతో నిరాశపరుస్తున్నాడు. కీపింగ్‌తోనూ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు.’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో టీమ్ మేనేజ్‌మెంట్‌కు ధ్రువ్ జురెల్ మరో ఆప్షన్‌గా ఉన్నాడని, అతను ఉత్తరప్రదేశ్, భారత్ ఏ, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అతను సత్తాచాటాడని చెప్పాయి. అయితే, భరత్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇవ్వాలని చూడొచ్చు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై జురెల్‌తో పోలిస్తే అనుభవం ఉన్న భరత్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం దక్కితే మూడో టెస్టులో అతని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది.

Tags:    

Similar News