ఐపీఎల్ 2023లో.. ఈసారి నాలుగు నయా రూల్స్.. అవేంటో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌కు దగ్గర పడింది. మరో 11 రోజుల్లో ధనాధన్ లీగ్‌కు తెరలేవనుంది.
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌కు దగ్గర పడింది. మరో 11 రోజుల్లో ధనాధన్ లీగ్‌కు తెరలేవనుంది. ఇప్పటికే లీగ్‌లోని 10 ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో తమ సన్నాహకాలు మొదలు పెట్టాయి. మరోవైపు బీసీసీఐ కూడా 16వ సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మలిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ప్రవేశపెట్టడంతో పాటు టీమ్స్ రివ్యూల సంఖ్యను కూడా పెంచేసింది. వైడ్, నోబాల్‌లకు కూడా రివ్యూలు తీసుకునే అవకాశం కల్పించింది.
ఈ రెండు రూల్సే కాకుండా మరో నాలుగు నిబంధనలను కొత్తగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇరు జట్లు టాస్ వేసిన తర్వాత తమ తుది జట్లను ప్రకటించేలా కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ నిబంధనతో టాస్ నిర్ణయాన్ని బట్టి తుది జట్టును, ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఆయా జట్లు ఎంపిక చేసుకోవచ్చు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో నిబంధనను తొలిసారి అమలు చేయగా.. ఐపీఎల్‌లో రెండోసారి అమలు చేస్తున్నారు. భారత మైదానాల్లో డ్యూ ప్రభావం కీలకం కానున్న నేపథ్యంలో ఈ నిబంధన ఆయా జట్లకు ఉపయోగపడనుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్, ఫీల్డింగ్ ఎంచుకునేదాన్ని బట్టి తుది జట్టును ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు టాస్‌కు ముందే తమ తుది జట్లను ప్రకటించేవి. ఈ టాస్ రూల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అమలు చేస్తున్న స్లో ఓవరేట్ పెనాల్టీ రూల్‌ను కూడా అమలు చేయనున్నారు. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయని పక్షంలో సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని ఓవర్లు తక్కువైతే.. అన్ని ఓవర్ల పాటు సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే ఈ రూల్ అమలవుతుండగా ఐపీఎల్‌లో మొదటి సారి ప్రవేశ పెట్టనున్నారు. వికెట్ కీపర్, ఫీల్డర్ అనైతిక చర్యకు ఐదు పరుగులు పెనాల్టీగా విధించడంతో పాటు ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించనున్నారు. ఉద్దేశపూర్వకంగా బ్యాటర్ దృష్టి మరల్చినా.. ఇబ్బంది పెట్టినా అనైతిక చర్యగా భావిస్తారన్న విషయం తెలిసిందే.