ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఘనంగా మొదలుపెట్టిన వరల్డ్ నం.1 స్వైటెక్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఉమెన్స్ సింగిల్ వరల్డ్ నం.1, పొలాండ్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ శుభారంభం చేసింది.
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఉమెన్స్ సింగిల్ వరల్డ్ నం.1, పొలాండ్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో నెగ్గి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో స్వైటెక్ 7-6(7-2), 6-2 తేడాతో అమెరికా క్రీడాకారిణి సోఫియా కెనిన్‌పై సునాయాస విజయం సాధించింది. గంటా 51 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌ను స్వైటెక్ వరుస సెట్లలో గెలుచుకుంది. తొలి సెట్ మొదట్లో కెనిన్ దూకుడుగా ఆడింది. వరుసగా 2,3,4 గేమ్‌లను గెలుచుకుని 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, పుంజుకున్న స్వైటెక్ 6, 10 గేముల్లో బ్రేక్ పాయింట్ పొంది 5-5తో స్కోరు సమం చేసింది. 12వ గేమ్‌ను కెనిన్ గెలుచుకుని తొలి సెట్‌ను టై బ్రేకర్‌కు మళ్లించగా.. అక్కడ స్వైటెక్ పైచేయి సాధించింది. ఇక, రెండో సెట్‌లో స్వైటెక్ దూకుడు పెంచింది. 5, 7వ గేమ్‌లను గెలుచుకుని రెండో సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. గత ఎడిషన్ రన్నరప్, కజకిస్తాన్ క్రీడాకారిణి రిబాకినాతోపాటు 5వ సీడ్ జెస్సికా పెగులా(అమెరికా), రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్న విక్టోరియా అజరెంకా(బెలారస్) రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
అల్కరాజ్ బోణీ
మెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ నం.2 కార్లోస్ అల్కరాజ్ బోణీ కొట్టాడు. తొలి రౌండ్‌లో అల్కరాజ్ 7-6(7-5), 6-1, 6-2 తేడాతో రిచర్డ్ గాస్కెట్(ఫ్రాన్స్)ను చిత్తు చేశాడు. 2 గంటల 22 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ఆధిపత్యమే కొనసాగింది. తొలి సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ టై బ్రేకర్‌లో సెట్‌ను దక్కించుకున్న అతను.. మిగతా రెండు సెట్లను ఏకపక్షంగా గెలుచుకున్నాడు. ఉత్కంఠగా సాగిన మరో మ్యాచ్‌లో జర్మనీ ఆటగాడు డొమినిక్ కోపెర్‌ను 6-4, 3-6, 6-7(3-7), 3-6 తేడాతో సహచర ఆటగాడు, 6వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ చిత్తు చేసి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 8వ సీడ్, డెన్మార్క్ ప్లేయర్ హోల్గర్ రూనె తొలి రౌండ్ మ్యాచ్‌లో 6-2, 4-6, 7-6(7-3), 6-4 తేడాతో యోషిహిటో నిషియోకా(జపాన్)పై విజయం సాధించాడు.