స్వైటెక్‌దే మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్ కిరీటం.. వరుసగా మూడోసారి చాంపియన్‌గా

ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ మళ్లీ వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్‌దే. ఫైనల్‌లో ఆమె ఇటలీ క్రీడాకారిణి పౌలీనిని చిత్తు చేసి హ్యాట్రిక్ టైటిల్‌ను దక్కించుకుంది.

Update: 2024-06-08 15:11 GMT

దిశ, స్పోర్ట్స్ : ఎర్రమట్టి కోర్టు అంటే ఆమెకు పూనకాలే. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె దిగితే ప్రత్యర్థులకు ఓటమి భయమే. ఆ రేంజ్‌లో ఆధిపత్యం. పుట్టింది పోలాండ్‌లో అయినా ఫ్రాన్స్‌ను తన అడ్డాగా మార్చుకుంది. ఇప్పటికే మూడు టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు నాలుగోది(వరుసగా మూడోది) చేరింది. ఆ పోలాండ్ అమ్మాయే ఇగా స్వైటెక్. ఎప్పటిలాగే ఎర్రమట్టి కోర్టులో రెచ్చిపోయిన స్వైటెక్ వరుసగా మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది. జస్టిన్ హెనిన్(బెల్జియం) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో హ్యాట్రిక్ టైటిల్స్ సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా స్వైటెక్ రికార్డు నెలకొల్పింది.

ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ మళ్లీ వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్‌దే. శనివారం జరిగిన ఫైనల్‌లో ఆమె 12వ సీడ్, ఇటలీ క్రీడాకారిణి పౌలీనిపై చిత్తు చేసి హ్యాట్రిక్ టైటిల్‌ను దక్కించుకుంది. ఏకపక్షంగా టైటిల్ పోరులో స్వైటెక్ 6-2, 6-1 తేడాతో విజయం సాధించింది. కేవలం గంటా 8 నిమిషాల్లోనే వరుసగా రెండు సెట్లను గెలుచుకుంది. రౌండ్ రౌండ్‌ మినహా మిగతా అన్ని రౌండ్లలో స్వైటెక్ రెండు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం.

ఫైనల్‌లో స్వైటెక్‌కు అస్సలు పోటీనే లేదు. తొలి సెట్‌‌ ఆరంభంలో ఇద్దరు చెరోసారి సర్వీస్‌లను బ్రేక్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగానే మొదలైనా.. కాసేపటికే స్వైటెక్ ఏకపక్షం చేసింది. వరుసగా ఐదు గేమ్‌లను నెగ్గి తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక, రెండో సెట్‌లోనూ అదే జోరు. పౌలీని ఒక్క గేమ్ మాత్రమే నెగ్గింది. 7 గేముల్లోనే స్వైటెక్ రెండో సెట్‌ను ముగించి టైటిల్ చేజిక్కించుకుంది. తొలిసారిగా ఫైనల్‌కు చేరుకున్న పౌలీని కనీసం పోరాడలేకపోయింది. తొలి సెట్‌లో మూడో గేమ్‌లో బ్రేక్ పాయింట్ పొందడం మినహా స్వైటెక్‌కు ఆమె పోటీ ఇవ్వలేకపోయింది. రెండు డబుల్ ఫౌల్ట్స్, 18 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 


Similar News