ICC World Cup 2023 Final: 'ఇంత చెత్తాట ఎన్నడూ చూడలే.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో'.. టీమిండియా బ్యాటర్‌పై ఫ్యాన్స్ ఫైర్

Update: 2023-11-19 17:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో ఆఖరి మెట్టుపై టీమిండియా బోల్తా పడింది. ఆరోసారి ఆస్ట్రేలియా జట్టు విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. మూడో సారి కప్ గెలవాలన్న టీమిండియా ఆశ గంగపాలైంది. నాకౌట్ పోరులో మరోసారి టీమిండియా నిరాశపర్చింది. 241 పరుగుల సాధారణ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అయితే ఓ టీమిండియా బ్యాటర్ ఆటపై ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంతో నమ్మకంతో జట్టులో చోటు ఇస్తే.. చెత్తాటతో కొంపముంచావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ బ్యాటరో ఎవరో కాదు సూర్యకుమార్ యాదవ్. ఆఖరి పోరులో 36వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. టీ20 స్టైల్‌లో ఆడతాడనుకుంటే జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించాడు.

ఆఖరి 10 ఓవర్లలో పరుగులు చేయాల్సిన సూర్య.. బౌండరీలు ఆడడం రానట్టుగా బ్యాటింగ్ చేశాడు. డెత్ ఓవర్లలో కుల్దీప్ యాదవ్ క్రీజులోకి వచ్చిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ సింగిల్స్ తీస్తూ.. కాలక్షేపం చేశాడు. తన కంటే కుల్దీప్ యాదవ్ బాగా ఆడతాడన్నట్టుగా స్ట్రైయిక్ రొటేట్ చేయడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. చివరికి 28 బంతులు ఆడి ఒకే ఒక్క ఫోర్ బాది 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మెగాటోర్నీలో 7 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 17 యావరేజ్‌తో 106 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 49 పరుగులు మినహా.. మిగిలిన మ్యాచుల్లో 25+ పరుగులు కూడా చేయలేకపోయాడు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ ప్లేసులో రవిచంద్రన్ అశ్విన్‌ని ఆడించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అశ్విన్ ఆడి ఉంటే నీకన్నా మెరుగ్గా బ్యాటింగే చేసేవాడని.. అంతేకాకుండా బౌలింగ్‌లో వికెట్లు కూడా తీసేవాడని సూర్యని ట్రోల్ చేస్తున్నారు.

Tags:    

Similar News