‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో రోడ్రిగ్స్, దీప్తి

మహిళల కేటగిరీలో ఇద్దరు భారత క్రికెటర్లు ఉండటం విశేషం.

Update: 2024-01-08 15:09 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ ప్రతి నెలా పురుషుల, మహిళల క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రికెటర్లకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును అందజేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించిన అవార్డు నామినీలను ఐసీసీ సోమవారం రిలీజ్ చేసింది. మహిళల కేటగిరీలో ఇద్దరు భారత క్రికెటర్లు ఉండటం విశేషం. బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన ఏకైక టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయాల్లో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్‌, ఆసిస్‌పై రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీలతో మెరిసింది. అలాగే, ఆసిస్‌పై వన్డే సిరీస్‌లో 151 పరుగులతో భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక, దీప్తి శర్మ ఇంగ్లాండ్‌తో టెస్టులో 9 వికెట్లు తీయడంతోపాటు హాఫ్ సెంచరీ కూడా బాదింది. ఆసిస్‌తో రెండో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసింది. దీప్తిశర్మ, రోడ్రిగ్స్‌తోపాటు జింబాబ్వేకు చెందిన ప్రెషియస్ మారాంజ్ కూడా అవార్డు రేసులో ఉంది. పురుషుల కేటగిరీలో పాట్ కమిన్స్(ఆస్ట్రేలియా), తైజుల్ ఇస్లామ్(బంగ్లాదేశ్), గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్) అవార్డుకు నామినేట్ అయ్యారు.



Tags:    

Similar News