ఐసీసీ జట్టులో నలుగురు భారత ఆటగాళ్లకు చోటు

ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను రివీల్ చేయగా.. అందులో అత్యధికంగా భారత ఆటగాళ్లే సెలెక్ట్ అయ్యారు.

Update: 2024-02-12 17:36 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుకపోయిన విషయం తెలిసిందే. టోర్నీలో జైత్రయాత్ర కొనసాగించిన యువ భారత్ ఫైనల్‌లో ఓడి టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయింది. అయితే, టోర్నీలో భారత కుర్రాళ్లు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టీమ్‌ను చూసిన ఈ విషయం అర్థమవుతుంది. సోమవారం ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను రివీల్ చేయగా.. అందులో అత్యధికంగా భారత ఆటగాళ్లే సెలెక్ట్ అయ్యారు. భారత్ నుంచి కెప్టెన్ ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్, స్పిన్నర్ సౌమీ పాండేలకు చోటు దక్కింది. చాంపియన్ ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు (హ్యూ వీబ్డెన్, హ్యారీ డిక్సన్, కల్లమ్ విడ్లర్‌) ఎంపికయ్యారు. సౌతాఫ్రికా నుంచి ఇద్దరు, వెస్టిండీస్, పాకిస్తాన్, స్కాట్లాండ్ నుంచి ఒక్కొక్కరికి స్థానం దక్కింది. కాగా, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5లో ముగ్గురు భారత క్రికెటర్ల ఉండటం విశేషం. ఉదయ్ సహారన్ కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గా సత్తాచాటాడు. 7 మ్యాచ్‌ల్లో 56.71 సగటుతో 397 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముషీర్ ఖాన్ 360 పరుగులతో రెండో స్థానంలో, సచిన్ దాస్ 303 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా, టాప్ వికెట్ టేకర్ల జాబితాలో సౌమీ పాండే 18 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 

Tags:    

Similar News