Shubman Gill : 43 స్థానాలు ఎగబాకిన గిల్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను పొందాడు.
న్యూఢిల్లీ: ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను పొందాడు. బ్యాటింగ్ విభాగంలో ఏకంగా 43 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌ను చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో అతను 77 పరుగులతో సత్తాచాటిన విషయం తెలిసిందే. ఆ ప్రదర్శనతో తాజా ర్యాంకింగ్స్‌లో అతను తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. అయితే, ఐదు టీ20ల సిరీస్‌లో 102 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో కలిపి 166 పరుగులు చేశాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 46వ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో భారత బౌలర్లకు చోటు దక్కకపోవడం గమనార్హం. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 17వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
విండీస్ సిరీస్‌లో రాణించిన కుల్దీప్ యాదవ్ 23 స్థానాలను వెనక్కినెట్టి 28వ ర్యాంక్ సాధించాడు. ఐదు మ్యాచ్‌ల్లో అతను 6 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 2వ స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ 288 రేటింగ్ పాయింట్స్‌తో టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడు.