T20 WOrld cup 2024 : టీ20 ప్రపంచకప్‌తో భారీగా నష్టపోయిన ఐసీసీ.. లాస్ ఎంతో తెలుసా?

రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు ఇటీవల టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-18 12:42 GMT

దిశ, స్పోర్ట్స్ : రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు ఇటీవల టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు రోహిత్ సేన ఈ అపూర్వ విజయంతో తెరదించింది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌తోపాటు అమెరికా కూడా ఆతిథ్య దేశంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, యూఎస్‌ఏలో ప్రపంచకప్ నిర్వహణతో ఐసీసీకి భారీ నష్టం వాటిలినట్టు తెలుస్తోంది. దాదాపు రూ. 167 కోట్లు నష్టం వచ్చినట్టు సమాచారం.

టీ20 ప్రపంచకప్‌లో అమెరికా కేవలం గ్రూపు దశ మ్యాచ్‌లకే ఆతిథ్యమిచ్చింది. 12 గేమ్‌లో అక్కడ జరిగాయి. అందులో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు తప్ప మిగతా గేమ్‌లకు ప్రేక్షకుల ఆదరణ కరువైంది. ఖాళీ స్టేడియాలు దర్శనమిచ్చిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విండీస్‌లో కూడా ప్రపంచకప్ ఊహించినంత విజయవంతమవ్వలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ భారీ నష్టాన్ని చవిచూసినట్టు తెలుస్తోంది. కొలంబోలో శుక్రవారం నుంచి జరిగే ఐసీసీ వార్షిక సదస్సులో దీని గురించే చర్చించే అవకాశం ఉంది.

అలాగే, ఈ సదస్సులో 9 అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది జరగబోయే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి పాకిస్తాన్‌కు టీమ్ ఇండియా వెళ్తుందా?లేదా? అన్న దానిపై కూడా డిస్కషన్ జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఐసీసీ చైర్మన్ ఎన్నిక టైమ్‌లైన్ రూపొందించనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్‌లే చైర్మన్‌గా ఉన్నారు. బీసీసీఐ సెక్రెటరీ జై షా ఆ పదవిపై ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా సదస్సులో చర్చ జరిగే అవకాశం ఉంది.


Similar News