కామిందు, బ్యూమాంట్‌లకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డులు
సెప్టెంబర్ నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు విజేతలను ఐసీసీ సోమవారం ప్రకటించింది.
దిశ, స్పోర్ట్స్ : సెప్టెంబర్ నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు విజేతలను ఐసీసీ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో శ్రీలంక బ్యాటింగ్ సంచలనం కామిందె మెండిస్ అవార్డు గెలుచుకున్నాడు. సెప్టెంబర్‌లో మెండిస్ నాలుగు టెస్టులు ఆడగా.. 90.20 సగటుతో 451 పరుగులు చేశాడు. మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై విజయం సాధించడంలోనూ, న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడంలోనూ అతను కీలక పాత్ర పోషించాడు. కివీస్‌పై రెండు టెస్టుల్లోనూ సెంచరీలు(112, 182) బాదాడు.
సహచరుడు జయసూర్య, ఆసిస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌లను వెనక్కినెట్టి కామిందు అవార్డు గెలుచుకున్నాడు. మార్చి నెలలోనూ అతనికి అవార్డు దక్కిన విషయం తెలిసిందే. రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు కైవసం చేసుకున్న తొలి శ్రీలంక ప్లేయర్‌గా కామిందు నిలిచాడు. ఇప్పటివరకు 8 టెస్టులు ఆడిన అతను 1,004 రన్స్ చేశాడు. అందులో ఐదు సెంచరీలు ఉండటం గమనార్హం.
మహిళల విభాగంలో ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాటర్ టామీ బ్యూమాంట్‌ను అవార్డు వరించింది. ఆమెకు కూడా ఇది రెండో అవార్డు. 2021 ఫిబ్రవరిలో తొలి సారి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా నిలిచింది. సెప్టెంబర్‌లో ఐర్లాండ్ పర్యటనలో బ్యూమాంట్ సత్తాచాటింది. రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆమె 139 బంతుల్లో 150 పరుగులు చేసింది. మొత్తంగా 212 రన్స్ చేసి వన్డే సిరీస్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించింది.