వరుణ్ చక్రవర్తిని పక్కనపెట్టిన సెలెక్టర్లు.. కేకేఆర్ స్పిన్నర్ పోస్టుల అర్థమేంటి?

జింబాబ్వే టూరుకు తనను ఎంపిక చేయకపోవడంతో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Update: 2024-06-24 16:57 GMT

దిశ, స్పోర్ట్స్ : జింబాబ్వే టూరుకు తనను ఎంపిక చేయకపోవడంతో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరోక్షంగా సెలెక్టర్లపై అసహనం వ్యక్తం చేశాడు. ‘నాకు ఓ పీఆర్ ఏజెన్సీ ఉండాల్సింది’ అని పోస్టు చేశాడు. డబ్బా కొట్టే పీఆర్ ఏజెన్సీ లేకపోవడం వల్లే సెలెక్టర్లు తనను పక్కనపెట్టారనే ఉద్దేశంతోనే వరుణ్ ఆ పోస్టు పెట్టినట్టు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వరుణ్ కాసేపటికే మరో పోస్టు చేశాడు. ‘నేను మార్చలేని వాటిని అంగీకరించే ప్రశాంతతను, నేను చేయగలిగే వాటిని మార్చడానికి ధైర్యాన్ని, ఆ రెండింట మధ్య తేడాను తెలుసుకునే జ్ఞానాన్ని ఆ దేవుడు నాకు ఇవ్వాలి.’ అని పేర్కొన్నాడు. అయితే, కాసేపటికే వరుణ్ ఆ పోస్టులను డిలీట్ చేశాడు. అప్పటికే ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, 2021లో టీమ్ ఇండియా తరపున టీ20ల్లో అరంగేట్రం చేసిన వరుణ్ ఆరు మ్యాచ్‌ల్లో 2 వికెట్లు పడగొట్టాడు. చివరిసారిగా అదే ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌పై ఆడాడు. ఈ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 14 ఇన్నింగ్స్‌లో 21 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ప్రదర్శనతో తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కుతుందని ఆశించిన వరుణ్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. 


Similar News