Asia Cup 2023: ఆసియా కప్‌ ఫైనల్‌ ఫైట్.. మరోసారి భారత్‌ vs పాక్‌ పోరు.. అదే జరిగితే ఫ్యాన్స్‌కు పండుగే!

ఆసియా కప్‌-2023 సమరం ఆఖరి దశకు చేరుకుంది.

Update: 2023-09-13 11:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023 సమరం ఆఖరి దశకు చేరుకుంది. సూపర్‌- 4లో భారత జట్టు.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఇప్పటికే ఫైనల్‌ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే మరి ఫైనల్‌ల్లో భారత్‌తో తలపడేది ఎవరు.. శ్రీలంకనా..? పాకిస్థానా..? మరోసారి చిరకాల ప్రత్యర్థుల(IND vs PAK) మధ్య ఫైనల్‌ పోరుకు అవకాశం ఉందా..? భారత్‌ vs పాక్‌ పోరును మళ్లీ చూస్తామా..? సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

సూపర్‌-4 దశలో ఒక్కో జట్టు.. మిగతా వాటితో మూడేసి మ్యాచ్‌లు ఆడతాయి. ఇందులో టాప్‌ 2లో నిలిచిన జట్లు ఫైనల్‌ చేరుకుంటాయి. సూపర్‌ - 4 దశలో భారత్ తన తొలి మ్యాచ్‌లో పాక్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించి.. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత శ్రీలంకతో పోరాడి గెలిచింది. దీంతో 4 పాయింట్లు సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి.. ఫైనల్‌ చేరింది.

ఇక శ్రీలంక, పాకిస్థాన్‌ రెండేసి మ్యాచ్‌లు ఆడగా.. ఒక్కో మ్యాచ్‌లో ఓడి.. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే పాకిస్థాన్‌.. భారత్‌పై భారీ తేడాతో ఓడిపోవడంతో నెట్‌ రన్‌రెట్‌పై ప్రభావం పడి.. మూడో స్థానంలో ఉంది. దీంతో సెప్టెంబర్‌ 14న పాకిస్థాన్‌, శ్రీలంక మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ విజేత భారత్‌తో ఫైనల్‌లో తలపడనుంది.

ఒక వేశ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దు అయితే.. పాక్‌ ఫైనల్‌ ఆశలకు ఎదురు దెబ్బ పడనుంది. ఎందుకంటే.. మ్యాచ్‌ రద్దై చెరో పాయింట్‌ లభిస్తే.. 3 పాయింట్లతో ఇరు జట్లు సమానంగా ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్‌తో శ్రీలంక రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరుకుంటుంది. మ్యాచ్‌ జరిగి తప్పక విజయం సాధిస్తేనే పాక్‌ ఫైనల్‌కు చేరుతుంది. ఇక బంగ్లాదేశ్‌ ఇప్పటికే రెండింటిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సెప్టెంబర్‌ 15న భారత్‌, బంగ్లా మధ్య జరిగే మ్యాచ్‌ నామమాత్రమే.


Similar News