2023 Cricket World Cup : వరల్డ్ కప్​లో అతడిని ఆడించాలి : గంగూలీ ఆసక్తికర వ్యాఖ్య

భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది.

Update: 2023-07-06 10:21 GMT

దిశ, వెబ్​డెస్క్​ : భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. దీనికి సంబంధించి అప్పుడే అనేక ప్రచారాలు జోరందుకున్నాయి. ఇప్పటికే వరల్డ్ కప్ పోస్టర్​ను కూడా విడుదల చేశారు. మరో పక్క ఇందులో ఎవరెవరు ఆడాలి, ఎక్కడ ఏ జట్టుతో మ్యాచ్​ జరుగుతుంది వంటి ఆసక్తికర వార్తలు మీడియాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. కొత్త చీఫ్ సెలెక్టర్ ఛైర్మన్​ను కూడా ఎంపిక చేశారు. 2011 తర్వాత భారత్ మళ్లీ వన్డే వరల్డ్ కప్ గెలిచేందుకు ఇదే సరైన సమయమని ఇప్పటికే పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. స్వదేశంలో టోర్నీ జరగనుండటంతో భారత్‌కు కలిసొస్తుందని.. జట్టు ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటే కప్పు మనదే అని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మొత్తం 46 రోజుల పాటు భారత్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది.

 అక్టోబర్ 5 అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచుతో టోర్నీకి తెరలేవనుంది. భారత్​ తన తొలి మ్యాచును అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఢీకొట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. కాగా జట్టులో ఆటగాళ్ల విషయంలో తాజాగా ఇదే అంశంపై మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా స్పందించాడు. సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ టోర్నీలో కీలకంగా మారతాడని చెప్పుకొచ్చాడు. టీమిండియాకు మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ ఉన్నారు. యుజ్వేంద్ర చాహల్‌ను ఈ మధ్య పెద్ద టోర్నమెంట్‌లలో ఆడించడం లేదు. ఇది చాలా తప్పు. అతడు ఆడి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది.

 వన్డే అయినా, టీ-20 అయినా చాహల్ ప్రదర్శన మాత్రం నిలకడగా ఉంటుంది. అందువల్ల ప్రపంచప్‌ కోసం అతడి ఎంపికపై దృష్టి సారించాలి. వరల్డ్ కప్‌లో చాహల్‌ను కచ్చితంగా ఆడించాలి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్పెషలిస్టు స్పిన్నర్లే మ్యాచ్​ విన్నర్లుగా ఉంటారు అని గంగూలీ పేర్కొన్నాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా జట్ల బ్యాటర్లు మణికట్టు స్పిన్నర్లను ఎదుర్కోవడంతో ఇబ్బంది పడతారని అభిప్రాయపడ్డాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారని గుర్తు చేశాడు. స్పిన్నర్లు చెలరేగిన సమయాల్లో టీమిండియా ఎక్కువ విజయాలను నమోదు చేసిందని చెప్పుకొచ్చాడు.  

Tags:    

Similar News