భార‌త్‌, ఇంగ్లండ్ టెస్టును విజ‌య‌వంతంగా నిర్వహిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు

తొలి టెస్టును విజయవంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు.

Update: 2024-01-19 16:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25 నుంచి 29 మధ్య మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టును విజయవంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు తెలిపారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలోని గణపతి ఆలయం, ప్రధాన పిచ్ వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో కలిసి జగన్‌మోహన్ రావు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ.. ఇప్పటికే దాదాపు 20 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యాయని వెల్లడించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. తొలి టెస్టు మ్యాచ్‌కు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానుల నుంచి అనూహ్య స్పంద‌న వ‌స్తోంద‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దేవ్‌రాజ్, ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బసవరాజు పాల్గొన్నారు.  

Tags:    

Similar News