ఐపీఎల్‌లో పాల్గొనేందుకు కష్టపడుతున్న పాండ్యా
టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమై నాలుగు నెలలు అవుతుంది.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమై నాలుగు నెలలు అవుతుంది. వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో చీలమండలం గాయం బారిన పడిన అతను ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఆసిస్‌తో టీ20 సిరీస్‌తోపాటు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలు, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న పాండ్యా ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో చేరాడు.
వచ్చే నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభకానుంది. ఆ నాటికి ఫిట్‌నెస్ సాధించి లీగ్‌లో పాల్గొనాలని పాండ్యా భావిస్తున్నాడు. గత వారం కిరణ్ మోరె అకాడమీలో అతను పునరావాసం పూర్తి చేశాడు. తాజాగా ఎన్‌సీఏలో చేరిన అతను ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. బెంగళూరులోని ఆలూరులో పాండ్యా 20 ఓవర్ల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాడు. ఎన్‌సీఏ ఫిజియోలు, ట్రైనర్లు అతన్ని పర్యవేక్షించారు. అలాగే, గురువారం కూడా మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నాడు. ఐపీఎల్ ప్రారంభం వరకు అతను ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను తప్పించి ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, అతను గాయం నుంచి కోలుకున్నా ఫిట్‌నెస్ సాధించడంపై సందిగ్ధం నెలకొనడంతో టోర్నీలో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రారంభ మ్యాచ్‌లకు అతను దూరంగా ఉండబోతున్నట్టు వార్తలు వచ్చాయి. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో బీసీసీఐ కూడా అతనికి క్లియరెన్స్ ఇస్తుందా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే, పాండ్యా మార్చి నాటికి 100 శాతం ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే పాండ్యా టోర్నీ ఆరంభం నుంచే అందుబాటులో ఉండనున్నాడు.