ఖతార్‌తో మ్యాచ్‌కు భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా గుర్‌ప్రీత్

ఫిఫా వరల్డ్ కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా భారత జట్టు ఈ నెల 11న ఖతార్‌తో తలపడనుంది.

Update: 2024-06-09 16:31 GMT

దిశ, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా భారత జట్టు ఈ నెల 11న ఖతార్‌తో తలపడనుంది. భారత్ మూడో రౌండ్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. ఈ మ్యాచ్‌లో భారత జట్టును గోల్‌ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ నడిపించనున్నాడు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘సునీల్, సందేశ్‌లతోపాటు మా కెప్టెన్లలో గుర్‌ప్రీత్ కూడా ఉన్నాడు. కాబట్టి, ఈ తరుణంలో అతను సహజంగానే బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.’అని హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ తెలిపాడు. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 6న కువైట్‌పై అతను చివరి మ్యాచ్ ఆడాడు. ప్రస్తుత భారత జట్టులో 32 ఏళ్ల గుర్‌ప్రీత్ సింగ్ సీనియర్ ఆటగాడిగా ఉన్నాడు. ఖతార్‌తో మ్యాచ్‌కు స్టిమాక్ శనివారమే 23 మందితో జట్టును ప్రకటించాడు. శనివారం రాత్రే దోహాకు చేరుకున్న భారత ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్ చేశారు. సోమవారం అధికారిక ప్రాక్టీస్‌లో పాల్గొంటారు.


Similar News