మెస్సీకి బెదిరింపులు.. సూపర్ మార్కెట్‌పై కాల్పులు
అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి కొందరు దుండగులు బెదిరింపు లేఖ రాశారు.
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి కొందరు దుండగులు బెదిరింపు లేఖ రాశారు. మెస్సీ సొంత నగరమైన రొసారియోలోని తన భార్య కుటుంబానికి చెందిన సూపర్ మార్కెట్‌పై శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు దుండుగులు 14 రౌండ్లు కాల్పులు జరిపారు. అలాగే, అక్కడే బెదిరింపు లేఖ వదిలిపెట్టి వెళ్లారు. ‘మెస్సీ, నీ కోసం ఎదురుచూస్తున్నాం. జావ్కిన్ ఓ మాదకద్రవ్యాల డీలర్. అతను మిమ్మల్ని కాపాడలేడు’ అని లేఖలో రాసి ఉంది.
సూపర్ మార్కెట్ మూసి ఉండటంతో ఎవరికి ఎలాంటి గాయాలు కలుగలేదు. లేఖలో పేర్కొన్న జావ్కిన్ రోసారియో నగర మేయర్. జావ్కిన్ ఈ ఘటనను ధ్రువీకరించారు. సూపర్ మార్కెట్ మెస్సీ భార్య ఆంటోనెలా రొకజో కుటుంబానికి చెందినదని స్పష్టం చేశారు. నగరంలో అల్లర్లు సృష్టించడం, వైరల్ అవడం కోసమే ఈ దాడికి చేశారని తెలిపారు. ‘దీనివల్ల దుండగులకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. వైరల్ అవ్వడానికి, ప్రజలు ఈ ఘటన గురించి కొంతకాలం మాట్లాడుకోవడానికి ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా డ్రగ్ మాఫియా పనే. దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు’ అని పోలీసులు తెలిపారు.