Fide Rankings: విశ్వనాథన్‌ ఆనంద్‌ రికార్డును అధిగమించిన 17 ఏళ్ల కుర్రాడు..

భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ డి. గుకేశ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Update: 2023-09-01 11:50 GMT

దిశ, వెబ్‌డెస్క్:  భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ డి. గుకేశ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తాజాగా ఫిడే ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో గుకేశ్‌ 8వ స్థానానికి చేరాడు. ఈ క్రమంలో దాదాపు 37 ఏళ్లపాటు భారత్‌ తరఫున టాప్‌ ర్యాంకర్‌గా కొనసాగుతున్న చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ రికార్డును గుకేశ్‌ అధిగమించాడు. ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్‌ ప్రకారం గుకేశ్‌ 2,758 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకోగా.. విశ్వనాథన్‌ ఆనంద్ 2,754 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో భారత్‌ తరఫున టాప్‌ ప్లేయర్‌గా గుకేశ్‌ అవతరించాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన విశ్వనాథన్‌ ఆనంద్ 1986 జులై నుంచి భారత్‌ నంబర్‌వన్‌ ఆటగాడిగా ఉన్న రికార్డును ఇప్పుడు గుకేశ్‌ అధిగమించాడు.

ఇక ఈ జాబితాలో టాపర్ మాత్రం కార్ల్‌సన్. ఇటీవలే చెస్ ప్రపంచ కప్‌ను నెగ్గిన కార్ల్‌సన్‌ ఖాతాలో 2,839 ఫిడే పాయింట్లు ఉన్నాయి. భారత మరో యంగ్ గ్రాండ్‌ మాస్టర్, చెస్‌ ప్రపంచకప్‌ 2023 ఫైనలిస్ట్‌ ఆర్‌ ప్రజ్ఞానంద 2,727 పాయింట్లతో 19వ స్థానానికి చేరాడు. దీంతో గుకేశ్‌, ఆనంద్‌ తర్వాత భారత మూడో టాప్‌ ప్లేయర్‌గా నిలిచాడు. టాప్‌-30 ర్యాకింగ్స్‌లో వీరు ముగ్గురే కాకుండా విదిత్ సంతోష్ (27), అర్జున్‌ ఇరిగైసి (29) ముందడుగులో ఉన్నారు. మరో సీనియర్‌ చెస్‌ ప్లేయర్ పెండ్యాల హరికృష్ణ 31 ర్యాంకులో నిలిచాడు. మహిళల జాబితాలో భారత చెస్ ప్లేయర్ కోనేరు హంపి 2,550 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.


Similar News