పాండ్యాది తెలివి తక్కువ నిర్ణయమే: ఆకాశ్ చోప్రా
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడి ముంబై ఇండియన్స్‌లో చేరుతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.
న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడి ముంబై ఇండియన్స్‌లో చేరుతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ట్రేడింగ్ విండో ద్వారా పాండ్యాను ముంబై జట్టు రూ.15 కోట్లకు కొనుగోలు చేసిందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇరు ఫ్రాంచైజీలు గానీ, పాండ్యా గానీ స్పష్టతనివ్వలేదు. ఈ వార్తలపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్‌లో స్పందించాడు.
కెప్టెన్సీ లేకుండా పాండ్యా ముంబై జట్టులోకి వెళ్లడానికి అంగీకరిస్తే అది తెలివి తక్కువ నిర్ణయమే అవుతుందని వ్యాఖ్యానించాడు. ‘పాండ్యా ముంబైలోకి వెళ్తున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకసారి టైటిల్, మరోసారి ఫైనల్‌కు చేరిన సారథిని ముందుగా గుజరాత్ టైటాన్స్ వదులుకుంటుందా?. ఒకవేళ అతను వెళ్తే ముంబైకి కెప్టెన్ అవుతాడా?. కెప్టెన్సీ లేకుండా అతను ముంబైలోకి వెళ్లడం ఎందుకు?. రోహిత్ గుజరాత్ జట్టులోకి వస్తాడా? అందుకు అవకాశం ఉందా?. ఏం జరుగుతుందో చూద్దాం. నిప్పు లేనిది పొగ రాదు.’ అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
కాగా, ఐపీఎల్ వేలానికి ముందు ట్రేడింగ్ విండో ద్వారా ‘ప్లేయర్ టూ ప్లేయర్, ప్లేయర్ టూ మనీ’ ద్వారా ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు ఆదివారంతో గడువు ముగియనున్న నేపథ్యంలో పాండ్యా ముంబైలోకి వెళ్తున్నాడా?లేదా? అనేది నేడు స్పష్టతరానుంది.