పీకేఎల్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన గుజరాత్ జెయింట్స్.. ఆ జట్టు నేరుగా సెమీస్‌కు..
ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ కే.సీ తర్వాత ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న నాలుగో జట్టు గుజరాత్ జెయింట్స్. బెంగుళూరు బుల్స్‌పై నెగ్గడంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆదివారం కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 50-28 తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి గుజరాత్ దూకుడు ప్రదర్శించింది. మ్యాచ్‌లో నాలుగు సార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. సెకండాఫ్‌లో బెంగళూరు కాస్త పుంజుకున్న గుజరాత్‌ను అడ్డుకోలేకపోయింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. రైడర్ పార్తీక్ దహియా 13 పాయింట్లతో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌ను 29-56 తేడాతో పుణేరి పల్టాన్ చిత్తు చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఆ జట్టు ఈ విజయంతో నేరుగా సెమీస్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో పుణేరి పల్టాన్ అగ్రస్థానంలో ఉన్నది. టాప్-2 జట్లు నేరుగా సెమీస్‌కు చేరుతాయి. అలాగే, నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖాయమవ్వగా.. ఇంకా రెండు స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాట్నా పైరేట్స్, హర్యానా స్టీలర్స్ జట్లు ముందు వరుసలో ఉన్నాయి.