Asia cup: బంగ్లాపై భారత్ ఘన విజయం..వరుసగా 9వ సారి ఫైనల్‌కు టీమిండియా
శ్రీలంక వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్ టోర్నీలో టీమిండియా అమ్మాయిలు దుమ్మురేపుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్ టోర్నీలో టీమిండియా అమ్మాయిలు దుమ్మురేపుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థులను వణికిస్తున్నారు. ఓటమి లేకుండానే లీగ్ దశను ముగించి సెమీస్ చేరిన భారత్.. సెమీస్‌లోనూ అదే రిపీట్ చేసింది. శ్రీలంకలోని డంబుల్లా స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన సెమీస్-1లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడా చిరస్మరణీయ గెలుపును కైవసం చేసుకుని 9వ సారి ఆసియా కప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నిగర్ సుల్తానా (32), షోర్నా అక్తర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. భారత బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు మిగిలిన బ్యాటర్లు అంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. భారత్ బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ చెరో 3 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు.
అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 11 ఓవర్లలోనే వికెట్ నష్ట పోకుండా మ్యాచ్‌ను ముగించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మందాన హాఫ్ సెంచరీ (55 నాటౌట్)తో దుమ్మురేపగా, మరో ఓపెనర్ షెషాలీ వర్మ 26 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరే చెలరేగి ఆడటంతో వికెట్ నష్టపోకుండా ఘన విజయం సాధించిన భారత్.. టోర్నీలో ఇప్పటి వరకు ఓటమన్నదే చూడకుండా ఫైనల్ చేరుకుంది. తాజా విజయంతో ఆసియా కప్ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు (9 టైమ్స్) ఫైనల్ చేరిన జట్టుగా టీమిండియా మహిళల జట్టు రికార్డ్ సృష్టించింది.