గూగుల్‌లో చూడు.. నా బ్యాటింగ్ ఏంటో తెలుస్తుంది.. ఆసిస్ జర్నలిస్ట్‌కు బుమ్రా కౌంటర్

తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నించిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా కౌంటర్ ఇచ్చాడు.

Update: 2024-12-16 12:58 GMT

దిశ, స్పోర్ట్స్ : తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నించిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా కౌంటర్ ఇచ్చాడు. ఓ టెస్టు ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరో తెలుసు కదా అంటూ జర్నలిస్ట్ నోరు మూయించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో సోమవారం వర్షం కారణంగా ఆట పూర్తిగా సాగలేదు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తడబడుతోంది.

ఆట ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత బ్యాటింగ్‌పై స్పందించాలని ఓ జర్నలిస్ట్ బుమ్రాను అడిగాడు. ‘భారత్ బ్యాటింగ్‌పై అంచనా ఏంటి. దీనికి సమాధానం చెప్పే సరైన వ్యక్తి మీరు కాదు. కానీ, జట్టు పరిస్థితి గురించి మీరు ఏమనుకుంటున్నారు.’ అని ప్రశ్నించాడు. దానిని బుమ్రా స్పందిస్తూ..‘మీరు నా బ్యాటింగ్ సామర్థ్యాన్నిప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం గూగుల్ చెబుతుంది. ఓ టెస్టు ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఎవరో చేశారో తెలుసు కదా.’ అని సమాధానమిచ్చి జర్నలిస్ట్ నోరు మూయించాడు. దీంతో అక్కడి ఉన్న వారంతా నవ్వుకున్నారు.

ఓ టెస్టు ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు బుమ్రా పేరిటే ఉంది. 2022లో ఇంగ్లాండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో బుమ్రా 35 పరుగులు పిండుకున్నాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లతో భారత ఫాస్ట్ బౌలర్ విధ్వంసాన్ని ఇప్పటికీ భారత అభిమానులు మర్చిపోలేరు.

Tags:    

Similar News