‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేసులో గిల్, సిరాజ్..

సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు కోసం ఇద్దరు భారత క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ పోటీపడుతున్నారు.

Update: 2023-10-10 14:30 GMT

న్యూఢిల్లీ : సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు కోసం ఇద్దరు భారత క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ పోటీపడుతున్నారు. అవార్డుకు షార్ట్ లిస్ట్ అయిన నామినీలను ఐసీసీ మంగళవారం వెల్లడించింది. టీమ్ ఇండియా ఓపెనర్ గిల్, పేసర్ సిరాజ్‌, ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. భారత్ తరఫున గిల్, సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. గత నెలలో ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్‌ కలుపుకుని గిల్ రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో 480 పరుగులు చేశాడు. ఈ ఏడాది జనవరిలో గిల్ తొలిసారిగా ఈ అవార్డు గెలుచుకున్నాడు.

మరోవైపు, సిరాజ్ సెప్టెంబర్‌లో వన్డేల్లో వరల్డ్ నం.1 ర్యాంక్‌ను తిరిగి పొందాడు. అంతేకాకుండా, భారత్ ఆసియా కప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో శ్రీలంకపై అతను 6 వికెట్ల ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక 50 పరుగులకే పరిమితమవ్వగా.. భారత్ సునాయాసంగా గెలిచింది. మొత్తంగా గత నెలలో అతను 17.27 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. అలాగే, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ మలన్ వరుసగా 54, 96, 127 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఐసీసీ అవార్డు ఎవరిని వరిస్తుందో చూడాలి.


Similar News