ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన బోపన్న జోడీ
నాలుగు పదుల వయసులోనూ భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న అదరగొడుతున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : నాలుగు పదుల వయసులోనూ భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన బోపన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌పై కన్నేశాడు. ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ కేటగిరీలో ఆస్ట్రేలియా పార్ట్నర్ మాథ్యూ ఎబ్డెన్తో కలిసి బోపన్న సెమీస్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బోపన్న జోడీ 7-6(7-3), 5-7, 6-1 తేడాతో బెల్జియంకు చెందిన సాండర్ గిల్లే-జోరాన్ వ్లీగెన్ జంటను ఓడించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి సెట్‌ను బోపన్న జంట టై బ్రేకర్‌లో దక్కించుకుని శుభారంభం చేసింది. అయితే, రెండో సెట్లో ప్రత్యర్థులు షాకివ్వగా.. నిర్ణయాత్మక మూడో సెట్‌కు వెళ్లింది. అక్కడ బోపన్న, ఎబ్డెన్లదే పూర్తి ఆధిపత్యం. ఏకపక్షంగా మూడో సెట్‌ను నెగ్గిన ఆ జంట మ్యాచ్‌నూ దక్కించుకుని 2022 తర్వాత రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌లో అడుగుపెట్టాడు. గురువారం జరిగే సెమీస్‌లో సిమోన్ బోలెల్లి-ఆండ్రియా వయస్సోరి(ఇటలీ) జంటతో బోపన్న జోడీ తలపడనుంది.