ఫ్రెంచ్ ఓపెన్ : మూడో రౌండ్‌లో పోరాడి గెలిచిన జకోవిచ్

సెర్బియా టెన్నిస్ స్టార్, 24 గ్రాండ్‌‌స్లామ్‌ల విజేత నోవాక్ జకోవిచ్ మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు.

Update: 2024-06-02 17:56 GMT

దిశ, స్పోర్ట్స్ : సెర్బియా టెన్నిస్ స్టార్, 24 గ్రాండ్‌‌స్లామ్‌ల విజేత నోవాక్ జకోవిచ్ మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. అయితే, మూడో రౌండ్‌ను దాటేందుకు వరల్డ్ నం.1 శ్రమించాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో జకో 7-5, 6-7(6-8), 2-6, 6-3, 6-0 తేడాతో 30వ సీడ్ లొరెంజో ముసెట్టీ(ఇటలీ)పై పోరాడి గెలిచాడు. ఐదు సెట్లుగా జరిగిన ఈ మ్యాచ్ 4 గంటల 29 నిమిషాలపాటు సుదీర్ఘంగా సాగింది. ఈ మ్యాచ్‌లో జకోకు ముసెట్టి నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. తొలి సెట్ నెగ్గిన అతనికి ముసెట్టీ వరుసగా రెండు, మూడు సెట్లలో షాకిచ్చాడు. దీంతో మూడో రౌండ్‌లోనే జకో ఆట ముగుస్తుందేమో అనిపించగా.. ఆ పరిస్థితుల్లో అతను అద్భుతంగా పుంజుకున్నాడు. చివరి రెండు సెట్లను దక్కించుకుని విజేతగా నిలిచాడు. 3వ సీడ్ అల్కరాజ్(స్పెయిన్) క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. నాలుగో రౌండ్‌లో అతను 6-3, 6-3, 6-1 తేడాతో ఫెలిక్స్(కెనడా)పై గెలుపొందాడు. అలాగే, 7వ సీడ్ కాస్పర్ రూడ్(నార్వే) ప్రీక్వార్టర్స్‌కు చేరుకోగా.. 9వ సిట్సిపాస్(గ్రీస్) క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.

స్వైటెక్ హవా

ఉమెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ నం.1, డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వైటెక్ జోరు కొనసాగుతోంది. ఏకపక్ష విజయాలతో దూకుడుగా ఆడుతున్న ఈ పోలాండ్ క్రీడాకారిణి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రీక్వార్టర్స్‌లో స్వైటెక్ 6-0, 6-0 తేడాతో అన్‌సీడ్ క్రీడాకారిణి పొటాపోవాను చిత్తు చేసింది. అలాగే, 3వ సీడ్ కోకా గాఫ్ 6-1, 6-2 తేడాతో కోకియారెట్టో(ఇటలీ) నెగ్గి ముందడుగు వేసింది.

బోపన్న జోడీ శుభారంభం

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియా పార్ట్‌నర్ మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న జోడీ 7-5, 4-6, 6-4 తేడాతో బ్రెజిల్‌కు చెందిన జోర్మాన్-ఓర్లాండో లూజ్ జంటపై విజయం సాధించింది. బోపన్న జంట ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే.


Similar News