స్వైటెక్ హ్యాట్రిక్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌కు

ఉమెన్స్ సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకునే దిశగా సాగుతోంది.

Update: 2024-05-31 18:23 GMT

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకునే దిశగా సాగుతోంది. టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుని ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో ఈ పోలాండ్ స్టార్ 6-4, 6-2 తేడాతో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మేరీ బౌజ్కోవాను ఓడించింది. గంటా 33 నిమిషాల్లోనే స్వైటెక్ వరుసగా రెండు సెట్లను గెలుచుకుని మ్యాచ్‌ను దక్కించుకుంది. 34 విన్నర్లతో విరుచుకుపడిన ఆమె నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసింది. మేరీ బౌజ్కోవా మూడు డబుల్ ఫౌల్ట్స్, 12 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. నాలుగో రౌండ్‌లో అన్‌సీడ్ క్రీడాకారిణి పొటాపోవా(రష్యా)తో స్వైటెక్ తలపడనుంది. 3వ సీడ్, కోకా గాఫ్(అమెరికా) సైతం ముందడుగు వేసింది. మూడో రౌండ్‌లో యాస్ట్రేమ్స్కా(ఉక్రెయిన్)పై 2-6, 4-6 తేడాతో విజయం సాధించింది. అలాగే, 5వ సీడ్, వింబుల్డన్ చాంపియన్ వొండ్రుసోవా(చెక్‌ రిపబ్లిక్‌) 6-1, 6-3 తేడాతో క్లో పాకెట్(చైనా)ను ఓడించి తర్వాతి రౌండ్‌కు చేరుకుంది. మరోవైపు, రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన విక్టోరియా అజరెంకా(బెలాసర్) రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది. అన్‌సీడ్ క్రీడాకారిణి మిర్రా ఆండ్రీవా(రష్యా) చేతిలో 6-3, 3-6, 7-5 తేడాతో అజరెంకా ఓడిపోయింది.

రుబ్లెవ్ ఔట్

మెన్స్ సింగిల్స్‌లో 6వ సీడ్ రుబ్లెవ్ పోరాటం ముగిసింది. మూడో రౌండ్‌లో అతనికి 6-7(6-8), 2-6, 4-6 తేడాతో మాటియో అర్నాల్డి(ఇటలీ) షాకిచ్చాడు. 2వ సీడ్ జెన్నిక్ సిన్నర్ టోర్నీలో ముందడుగు వేశాడు. మూడో రౌండ్‌లో సిన్నర్ 6-4, 6-4, 6-4 తేడాతో పావెల్ కోటోవ్(రష్యా)ను ఓడించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. 9వ సీడ్ సిట్సిపాస్(గ్రీస్) 6-3, 6-3, 6-1 తేడాతో జాంగ్ జిజెన్(చైనా)ను ఓడించి ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. 


Similar News