french open : ఫైనల్‌కు స్వైటెక్, పౌలీని

ఫ్రెంచ్ ఓపెన్‌లో వరల్డ్ నం.1, పోలాండ్ క్రీడాకారిని ఇగా స్వైటెక్ హ్యాట్రిక్ టైటిల్ కన్నేసింది.

Update: 2024-06-06 20:26 GMT

దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్‌లో వరల్డ్ నం.1, పోలాండ్ క్రీడాకారిని ఇగా స్వైటెక్ హ్యాట్రిక్ టైటిల్ కన్నేసింది. వరుసగా మూడో సారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు, ఇటలీ క్రీడాకారిణి పౌలీని సంచలనం సృష్టించింది. కెరీర్‌లో తొలిసారిగా ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు చేరుకుంది. శనివారం స్వైటెక్, పౌలీని మధ్య ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ పోరు జరగనుంది.

టోర్నీ ఆరంభం నుంచి డిఫెండింగ్ చాంపియన్ స్వైటెక్ ఏకపక్ష విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగించిన ఆమె 3వ సీడ్, అమెరికా స్టార్ కోకా గాఫ్‌ను మట్టికరిపించింది. గురువారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో స్వైటెక్ 6-2, 6-4 తేడాతో గాఫ్‌ను ఓడించింది. ఆధిపత్యం ప్రదర్శించిన స్వైటెక్ గంటా 37 నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గాఫ్ తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న స్వైటెక్ దూకుడుగా ఆడింది. ఆమె షాట్లకు గాఫ్ వద్ద సమాధానం లేకుండా పోయింది. తొలి సెట్‌లో ఆమెకు పోటీనే లేదు. రెండో సెట్‌లో గాఫ్ కాస్త ప్రతిఘటించినా స్వైటెక్ ఆమెను నిలువరించింది. కోకా గాఫ్ 3 ఏస్‌లు, 27 విన్నర్లతో చెలరేగినా అనవసర తప్పిదాలు కొంపముంచాయి. నాలుగు డబుల్ ఫౌల్ట్స్, 39 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.

మరో సెమీస్‌లో 12 సీడ్ పౌలీని కూడా ఏకపక్ష విజయం సాధించింది. క్వార్టర్స్‌లో వరల్డ్ నం.2 సబలెంక‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన అన్‌సీడ్ క్రీడాకారిణి ఆండ్రీవా సెమీస్‌ను దాటలేకపోయింది. ఆండ్రీవాపై 6-3, 6-1 తేడాతో పౌలీని గెలుపొందింది. 4సార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసిన పౌలీని గంటా 13 నిమిషాల్లోనే రెండు సెట్లను నెగ్గింది. దీంతో ఓ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారిగా టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. రాబెర్టా విన్సీ(2015, యూఎస్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌లో, సారా ఎర్రాని(2012) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. 


Similar News