ఎర్రమట్టి కోర్టులో కొత్త కింగ్.. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా అల్కరాజ్

ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను అల్కరాజ్ దక్కించుకున్నాడు.

Update: 2024-06-09 18:19 GMT

దిశ, స్పోర్ట్స్ : నదాల్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. జకోవిచ్ గాయం కారణంగా క్వార్టర్స్ నుంచి తప్పుకున్నాడు. ఇక, అందరి చూపు అల్కరాజ్‌పైనే. ఈ స్పెయిన్ సంచలనం అంచనాలను నిలబెట్టుకుంటూ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఇప్పటికే యూఎస్ ఓపెన్, వింబుల్డన్ నెగ్గిన అతను.. తొలిసారిగా ఎర్రమట్టి కోర్టులో కింగ్‌గా అవతరించాడు.

ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను అల్కరాజ్ దక్కించుకున్నాడు. ఫైనల్‌కు చేరుకున్న తొలిసారే కప్పు గెలుచుకున్నాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో అల్కరాజ్ 6-3, 2-6, 5-7, 6-1, 6-2 తేడాతో 4వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించాడు. 4 గంటల 19 నిమిషాలపాటు ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఐదు సెట్లలో జరిగిన మ్యాచ్‌లో దోబూచులాడిన విజయం ఆఖరికి అల్కరాజ్‌నే వరించింది. తొలి సెట్ నెగ్గి శుభారంభం చేసిన అల్కరాజ్‌‌కు జ్వెరెవ్ వరుస షాక్‌లు ఇచ్చాడు. వరుసగా రెండు, మూడు సెట్లు నెగ్గి విజయానికి అడుగు దూరంలో నిలిచాడు.

ఈ పరిస్థితుల్లో అల్కరాజ్ పుంజుకున్న తీరు అద్భుతం. ఎంత బలంగా తిరిగొచ్చాడంటే మిగతా రెండు సెట్లలో జ్వెరెవ్ కనీసం పోటీ ఇవ్వలేకపోయాడు. అల్కరాజ్ నాలుగు, ఐదు సెట్లను ఏకపక్షంగా గెలుచుకుని చాంపియన్‌గా అవతరించాడు. మూడు ఏస్‌లు, 52 విన్నర్లు కొట్టిన అల్కరాజ్ 9సార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేశాడు. మరోవైపు, 6 డబుల్ ఫౌల్ట్స్, 41 అనవసర తప్పిదాలతో జ్వెరెవ్ మూల్యం చెల్లించుకున్నాడు. అల్కరాజ్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2022లో యూఎస్ ఓపెన్, గతేడాది వింబుల్డన్ టైటిల్స్ సాధించాడు. 


Similar News