ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం.. తొలి రౌండ్‌లోనే నదాల్ ఔట్
: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పెను సంచలనం నమోదైంది.
దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పెను సంచలనం నమోదైంది. 22 గ్రాండ్‌స్లామ్స్ విజేత, స్పెయిన్ స్టార్ రఫెల్ నదాల్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. ఈ టోర్నీ చరిత్రలో మోస్ట్ సింగిల్స్ టైటిల్ రికార్డు కలిగిన నదాల్‌కు జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ షాకిచ్చాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో నదాల్‌ను 3-6, 6-7(5-7), 3-6 తేడాతో జ్వెరెవ్ ఓడించాడు. జ్వెరెవ్ చేతిలో నదాల్ వరుసగా మూడు సెట్లు కోల్పోయాడు. రెండో సెట్‌లో ప్రతిఘటించడం మినహా నదాల్ తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. మూడు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో సెట్‌లో నదాల్ గట్టి పోటీనిచ్చాడు. రెండో సెట్‌లో నదాల్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొని మరి ఆ సెట్‌ను టై బ్రేకర్‌లో సొంతం చేసుకున్నాడు. తొలి, మూడు సెట్లలో పూర్తిగా జ్వెరెవ్ ఆధిపత్యమే కొనసాగింది. నదాల్ 3 డబుల్ ఫౌల్ట్స్, 30 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. జ్వెరెవ్ 8 ఏస్‌లు, 44 విన్నర్లు బాదితే.. నదాల్ కేవలం 2 ఏస్‌లు, 34 విన్నర్లు కొట్టాడు. జకోవిచ్, రాబిన్ సొడెర్లింగ్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో నదాల్‌ను ఓడించిన మూడో ప్లేయర్‌గా జ్వెరెవ్ నిలిచాడు. 37 ఏళ్ల నదాల్ తన కెరీర్‌లో ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి. 14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నదాల్.. చివరిసారిగా 2022లో విజేతగా నిలిచాడు. మరోవైపు, 2వ సీడ్ సిన్నర్(ఇటలీ), 9వ సీడ్ సిట్సిపాన్(గ్రీస్) తొలి రౌండ్‌లో శుభారంభం చేసి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
స్వైటెక్ శుభారంభం
ఉమెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్(పొలాండ్) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో స్వైటెక్ 6-1, 6-2 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన లియోలియా జీన్జీన్‌పై విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ను స్వైటెక్ కేవలం గంటలోనే సొంతం చేసుకుంది. రెండో రౌండ్‌లో ఆమె జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాకాతో తలపడనుంది. గతేడాది స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.
సుమిత్ ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ నిరాశపరిచారు. తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సుమిత్ 2-6, 0-6, 6-7(5-7) తేడాతో రష్యా ప్లేయర్ కరెన్ కచనోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు సెట్లలో సుమిత్ దారుణంగా తేలిపోయాడు. చివరిదైన మూడో సెట్‌లో సుమిత్ పుంజుకున్నా.. ప్రత్యర్థి టై బ్రేకర్‌లో విజయం సాధించాడు.