ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో భారత్‌కు తొలి పరాజయం.. ఆసిస్ చేతిలో ఓటమి
ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ టోర్నీలో భారత పురుషుల జట్టు తొలి పరాజయం పొందింది.
దిశ, స్పోర్ట్స్ : ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ టోర్నీలో భారత పురుషుల జట్టు తొలి పరాజయం పొందింది. వరుసగా స్పెయిన్, నెదర్లాండ్స్‌పై నెగ్గిన భారత జట్టు మూడో గ్రూపు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. భువనేశ్వర్ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో 4-6 తేడాతో ఆసిస్ జట్టు విజయం సాధించింది. ఫస్టాఫ్‌లో 4-2తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు ఆ తర్వాత పట్టు కోల్పోయి చేజేతులా మ్యాచ్‌ను ప్రత్యర్థికి సమర్పించుకుంది. 2వ నిమిషంలోనే గోవర్స్ బ్లేక్ రెండు గోల్స్ చేయడంతో ఆసిస్ మ్యాచ్‌ను దూకుడుగా మొదలుపెట్టింది. అనంతరం భారత్ బలంగా పుంజుకుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ 12వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌గా గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. కాసేపటికే సుఖ్‌జీత్ సింగ్ 18వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. ఆ తర్వాత 20వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్, 29వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ గోల్ చేయడంతో భారత్ 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం భారత్ పట్టు తప్పిందింది. ప్రత్యర్థికి వరుసగా అవకాశాలిచ్చింది. దీంతో చివరి రెండు క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా నాలుగు గోల్స్ చేసి విజేతగా నిలిచింది. పాయింట్స్ టేబుల్‌లో భారత్ 4వ స్థానంలో ఉన్నది. నేడు ఐర్లాండ్స్‌తో తలపడనుంది.