అందుకే పిచ్ మట్టి తిన్నా : రోహిత్

టీ20 వరల్డ్ కప్ విజయాన్ని అటు భారత క్రికెటర్లు, ఇటు అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

Update: 2024-07-02 15:10 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ విజయాన్ని అటు భారత క్రికెటర్లు, ఇటు అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించిన ఈ విజయం ఎంతో ప్రత్యేకమో.. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై గెలుపు అనంతరం భారత ఆటగాళ్లు భావోద్వేగానికి గురైన తీరే చెబుతుంది. కెప్టెన్ రోహిత్, కోహ్లీ, పాండ్యా సహా ఇతర ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎక్కువగా భావోద్వేగాలను భయపెట్టని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం కప్పు చేతుల్లో పట్టుకుని గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు.

రోహిత్ మైదానాన్ని ముద్దుపెట్టుకున్నాడు. బార్బడోస్ పిచ్ మట్టిని తిన్నాడు. తాజాగా తాను పిచ్ మట్టిని ఎందుకు తిన్నాననే విషయాన్ని రోహిత్ శర్మ వెల్లడించాడు. బార్బడోస్ పిచ్‌ను తనలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ మట్టిని తిన్నానని తెలిపాడు. రోహిత్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేసింది. ఆ వీడియోలో రోహిత్ మాట్లాడుతూ.. ‘పిచ్‌ దగ్గరికి వెళ్లినప్పుడు ఈ అద్భుత విజయాన్ని ఆ పిచ్ ఇచ్చిందని అనుభూతి చెందాను. అక్కడ మా కల నెరవేరింది. ఆ మైదానాన్ని, పిచ్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఆ పిచ్‌‌ను నాలో ఉంచుకోవాలనుకున్నా. ఈ జ్ఞాపకాలు చాలా స్పెషల్.’ అని తెలిపాడు.

టీ20 వరల్డ్ కప్ విజయం నమ్మశక్యంగా లేదని రోహిత్ చెప్పాడు ‘ఇంకా కలలా అనిపిస్తోంది. అది జరిగినా.. జరగలేదనే భావనలోనే ఉన్నాం. ఆ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేదు. అది ఒక గొప్ప క్షణం. దీని కోసమే ఎంతో కాలంగా ఎదురుచూశాం. కష్టపడ్డాం. దేని కోసమైన కష్టపడి అది సాధించిన తర్వాత ఆనందంగా ఉంటుంది. తెల్లవారుజాము వరకు అందరం సంబరాలు చేసుకున్నాం. సరిగా నిద్రపోలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత నిద్ర పోవడానికి చాలా సమయం ఉంటుంది. ఈ క్షణం మాకు ఎంతో ప్రత్యేకం. కాబట్టి, ప్రతి సెకన్, ప్రతి నిమిషం ఆ క్షణంతోనే జీవించాలనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఫైనల్ అనంతరం రోహిత్ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. 


Similar News