అతని కెప్టెన్సీ మరింత మెరుగ్గా ఉండాల్సింది : Gautam Gambhir

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు చేశాడు.

Update: 2023-09-15 16:14 GMT

న్యూఢిల్లీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు చేశాడు. గురువారం శ్రీలంకతో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో చివరి బంతికి ఓడిపోయి ఆసియా కప్‌ ఫైనల్‌కు చేరుకోవడంలో పాక్ జట్టు విఫలమైన విషయం తెలిసిందే. దీనిపై గౌతమ్ గంభీర్ స్పందించాడు. శుక్రవారం ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ, బాబర్ అజామ్ నాయకత్వంపై విమర్శలు గుప్పించాడు. ‘ఈ మ్యాచ్‌లో బాబర్ కెప్టెన్సీ నాకు అత్యంత సాదాసీదాగా అనిపించింది. మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారిన సమయంలో జమాన్ ఖాన్, షాహీన్ షా అఫ్రిదీ ఓవర్లలో లంక బ్యాటర్లు రెండు ఫోర్లు కొట్టారు.

ఈ రెండు ఫోర్లు మిడ్-ఆఫ్ మీదుగానే వెళ్లాయి. అవి కూడా స్లో డెలివరీలే. స్లో బౌలింగ్ చేయాలనుకున్నప్పడు, మిడ్-ఆఫ్ ఫీల్డర్‌ను లాంగ్-ఆఫ్‌లో ఉంచి, థర్డ్ మ్యాన్‌ని ముందుకు తీసుకురావాలి. అలాగే, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ మధ్య భాగస్వామ్యం కుదురుతున్నప్పుడు, ప్రధాన బౌలర్లను తీసుకుని వికెట్లు పడగొట్టడానికి ప్రయత్నించి ఉండాల్సింది. ఇవన్నీ కెప్టెన్ తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇందులో బాబర్ విఫలమయ్యాడు. కాబట్టి, బాబర్ అజమ్ తన కెప్టెన్సీలో మరింత మెరుగవ్వాలని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు.


Similar News