యూరో కప్ ఫైనల్‌కు ఇంగ్లాండ్.. సెమీస్‌లో నెదర్లాండ్స్‌పై సూపర్ విక్టరీ

యూరో కప్ ఫైనల్‌లో స్పెయిన్‌ను ఇంగ్లాండ్ ఢీకొట్టనుంది.

Update: 2024-07-11 17:15 GMT

దిశ, స్పోర్ట్స్ : యూరో కప్ ఫైనల్‌లో స్పెయిన్‌ను ఇంగ్లాండ్ ఢీకొట్టనుంది. ఫ్రాన్స్‌పై నెగ్గి స్పెయిన్ ఫైనల్‌కు చేరుకోగా.. మరో సెమీస్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి ఇంగ్లాండ్ టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. గురువారం హోరాహోరీగా సాగిన పోరులో ఇంగ్లాండ్ 2-1 తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటి గోల్ డచ్ జట్టుదే. నెదర్లాండ్స్ తరపున సైమన్స్ 7వ నిమిషంలోనే గోల్ చేశాడు. అనంతరం 18వ నిమిషంలో ఇంగ్లాండ్ ఖాతా తెరిచింది. హ్యారీ కేన్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు.

ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం విశ్వప్రయత్నాలు చేశాయి. పరస్పరం గోల్ పోస్టులపై దాడి చేసుకున్నాయి. అయితే, ఇరు జట్ల ఆటగాళ్ల చక్కటి డిఫెన్స్‌ ప్రదర్శించాయి. చివరకు 90వ నిమిషంలో ఆలివర్ వాట్కిన్స్ గోల్ చేసి ఇంగ్లాండ్‌కు విజయం కట్టబెట్టాడు. దీంతో వరుసగా రెండోసారి ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ నెల 15న స్పెయిన్‌, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఫైనల్ జరగనుంది. మరి, ఇంగ్లాండ్ తొలి యూరో కప్ టైటిల్ అందుకుంటుందో చూడాలి.


Similar News