యూరో కప్ చాంపియన్‌గా స్పెయిన్.. రికార్డు స్థాయిలో నాలుగోసారి

స్పెయిన్ అదరగొట్టింది. యూరో కప్ చాంపియన్‌గా నిలిచింది.

Update: 2024-07-15 16:00 GMT

దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్ అదరగొట్టింది. యూరో కప్ చాంపియన్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి టైటిల్ ఎగరేసుకపోయింది. మైకెల్ ఓయర్జాబల్ ఆఖర్లో గోల్ చేసి స్పెయిన్ హీరోగా నిలిచాడు. ఆ జట్టుకు ఇది నాలుగో టైటిల్. దీంతో రికార్డు స్థాయిలో యూర్ కప్ గెలిచిన జట్టుగా స్పెయిన్ రికార్డుకెక్కింది. మరోసారి ఇంగ్లాండ్ తొలి టైటిల్ స్వప్నం నెరవేరలేదు. వరుసగా రెండోసారి ఫైనల్‌లోనే ఆ జట్టు బోల్తా పడింది.

యూరో కప్ టైటిల్ నిరీక్షణకు స్పెయిన్ తెరదించింది. 2012లో చివరిసారిగా టైటిల్ నెగ్గిన ఆ జట్టు 12 ఏళ్ల తర్వాత తిరిగి చాంపియన్‌ హోదా దక్కించుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్‌లో స్పెయిన్ 2-1 తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. టైటిల్ కోసం స్పెయిన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఫస్టాఫ్‌లో ఏ జట్టు గోల్ చేయలేదంటే ఇరు జట్ల ఆటగాళ్లు ఎంత కసితో ఆడారో అర్థం చేసుకోవచ్చు. పరస్పరం గోల్ పోస్టులపై దాడి చేసుకున్నా.. ఇరు జట్ల డిఫెన్స్ టీమ్‌లు వాటిని తిప్పికొట్టాయి. ఇంగ్లాండ్‌తో పోలిస్తే స్పెయిన్ ఆటగాళ్లు ఎక్కువగా గోల్ పోస్టుపై దాడులు చేశారు.

ఎట్టకేలకు సెకండాఫ్‌ ఆరంభంలో స్పెయిన్ గోల్ నిరీక్షణకు తెరదించింది. 47వ నిమిషంలో నికో విలియమ్స్ ఆ జట్టు తరపున తొలి గోల్ చేశాడు. ఆ తర్వాత స్పెయిన్ ఆటగాళ్లు చాలా సేపు ఇంగ్లాండ్‌ను నిలువరించారు. అయితే, 73వ నిమిషంలో ఆ జట్టు తరపున కోల్ పామెర్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. దీంతో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. అయితే, మైకెల్ ఓయర్జాబల్ స్పెయిన్‌కు అదిరిపోయే గోల్ అందించాడు. 86వ నిమిషంలో అతను చేసిన గోల్‌తో స్పెయిన్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడంతో విజయం స్పెయిన్‌నే వరించింది. మ్యాచ్‌లో స్పెయిన్ 6 సార్లు ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడి చేయగా.. ఇంగ్లాండ్ 4సార్లే గోల్ పోస్టు వద్దకు దూసుకెళ్లింది. 1964, 2008, 2012ల్లో విజేతగా నిలిచిన స్పెయిన్‌కు ఇది నాలుగో టైటిల్. దీంతో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా స్పెయిన్ నిలిచింది. జర్మనీ మూడు టైటిల్స్‌తో ఆ తర్వాతి స్థానంలో ఉన్నది. 


Similar News