1983 World Cup win : భారత్ ప్రపంచ కప్ ముద్దాడి నేటితో 40 ఏళ్లు
India's victory in the 1983 Cricket World Cup holds an indelible place in Indian cricket history
దిశ, వెబ్ డెస్క్ : అప్పటి వరకు క్రికెట్ లో ఓ మోస్తారు జట్టుగా పేరు సంపాదించిన భారత్ సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఓ అద్భుతం చేసింది. ప్రపంచ చరిత్రను తిరగ రాస్తూ.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత జట్టు సమష్టిగా 1983 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. అప్పటికి మేటి జట్లుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లు సైతం ఫైనల్ చేరడంలో విఫలమయ్యాయి. చివరకు అరివీర భయంకరమైన విండీస్ జట్టుతో తలపడేందుకు పసికూన ముద్ర పడిన భారత్ అమీతుమీకి సిద్ధమైంది.
ఈ క్రమంలో టాస్ గెలిచిన విండిస్ జట్టు సారథి క్లైవ్ లాయిడ్ ఫిల్డిండ్ ఎంచుకుని భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ (38), మొహిందర్ అమర్‌నాథ్ (26), సందీప్ పాటిల్ (27) మాత్రమే మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. దీంతో నిర్ణీత 60 ఓవర్లలో భారత జట్టు కేవలం 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్కోరు చూసిన వాళ్లంతా విండీస్ విజయం ఖాయమని అనుకున్నారు.
ఈ నేపథ్యంలో అద్భుతం చోటుచేసుకుంది. భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు, ముఖ్యంగా బ్యాటుతో ఫర్వాలేదనిపించిన మొహిందర్ అమర్‌నాథ్ కేవలం 12 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మదన్ లాల్ కూడా 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోవడంతో విండీస్ ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. ఆ జట్టులో లెజెండరీ బ్యాటర్ వివ్ రిచర్డ్స్ (33), జెఫ్ డూయోన్ (25) మాత్రమే రాణించారు.
విండీస్‌ను గెలిపించేలా కనిపించిన రిచర్డ్స్‌ను కపిల్ దేవ్ క్లష్టమైన రన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. దీంతో విండీస్ ఆశలు గల్లంతయ్యాయి. భారత బౌలర్లలో మదన్ లాల్, అమర్‌నాథ్‌తోపాటు బల్వీందర్ సంధూ రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. రోజర్ బిన్నీ, కపిల్ దేవ్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో వెస్టిండీస్ కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
క్రికెట్‌లో భారత్ అందుకున్న తొలి వరల్డ్ కప్ ఇదే. ఈ విజయంతో అప్పట్లో అతిపెద్ద క్రికెట్ టీంగా ఉన్న వెస్టిండీస్ పతనం కూడా మొదలైంది. అంతకు ముందు వరుసగా రెండు సార్లు వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన ఆ జట్టు భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత మళ్లీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడలేదు. ఈ ఫైనల్ తర్వాత ప్రపంచ క్రికెట్ రూపురేఖలే మారిపోయాయి. భారత జట్టు ఒక పవర్ హౌస్‌గా ఎదిగిందని అప్పటి విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ స్టేట్ మెంట్ కూడా ఇవ్వడం గమనార్హం.