తొలి టెస్టు ఇంగ్లాండ్‌దే.. చిత్తుగా ఓడిన విండీస్

వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ శుభారంభం చేసింది.

Update: 2024-07-12 12:59 GMT

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. తొలి టెస్టులో భారీ విజయం సాధించింది. లండన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శుక్రవారం విండీస్‌ను ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌ను ఇంగ్లాండ్ కేవలం మూడు రోజుల్లోనే ముగించడం గమనార్హం. ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ 371 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.

భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కరేబియన్ జట్టు 47 ఓవర్లలో 136 పరుగులే చేసి కుప్పకూలింది. ఓవర్‌నైట్ స్కోరు 79/6తో శుక్రవారం ఆట కొనసాగించిన విండీస్ మూడో రోజు తొలి సెషనల్‌లోనే మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. గుడాకేశ్ మోటీ(31 నాటౌట్) టాప్ స్కోరర్. అలిక్ అథనాజె(22), హోల్డర్(20), లూయిస్(14) రెండెంకల స్కోరు నమోదు చేయగా.. మిగతా వారిలో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అట్కిన్సన్(5/61) ఐదు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన అతను మొత్తం 12 వికెట్లతో ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 


Similar News