టీ20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్

టీ20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది.

Update: 2024-05-31 12:50 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. పొట్టి ప్రపంచకప్‌‌కు సన్నాహక సిరీస్‌గా భావించిన ఇంగ్లాండ్ పర్యటనలో ఆ జట్టు ఘోరంగా విఫలమై టీ20 సిరీస్ కోల్పోయింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఆఖరిదైన నాలుగో టీ20లో 7 వికెట్ల తేడాతో పాక్‌ను ఇంగ్లాండ్ ఓడించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-0తో కైవసం చేసుకుంది. ఇందులో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి.

నాలుగో మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్.. ఇంగ్లాండ్ బౌలింగ్‌లో తడబడింది. 19.5 ఓవర్లలో 157 పరుగులే చేసి ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్(38), కెప్టెన్ బాబర్ ఆజామ్(36) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లు లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్ రెండేసి వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అనంతరం 158 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది. ఫిలిప్ సాల్ట్(45), బట్లర్(39) జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించి విజయాన్ని తేలిక చేయగా.. బెయిర్ స్టో(28 నాటౌట్), హ్యారీ బ్రూక్(17 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. ఇంగ్లాండ్ కోల్పోయిన మూడు వికెట్లు హరిస్ రవూఫ్‌ బౌలింగ్‌లోనే పడ్డాయి. 


Similar News