బజ్‌బాల్‌కు కొత్త అర్థం చెప్పిన స్టోక్స్.. దూకుడుగా ఆడటం కాదంట!
బజ్‌బాల్ ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించే ఇంగ్లాండ్ వ్యూహం భారత గడ్డపై పనిచేయలేదు.
దిశ, స్పోర్ట్స్ : బజ్‌బాల్ ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించే ఇంగ్లాండ్ వ్యూహం భారత గడ్డపై పనిచేయలేదు. ధర్మశాల టెస్టులోనూ ఘోర ఓటమిని పొంది 4-1తో సిరీస్‌ను టీమ్ ఇండియాకు అప్పగించింది. తొలి టెస్టులో బజ్‌బాల్ వ్యూహంతో గెలుపొందినా.. మిగతా మ్యాచ్‌ల్లో మాత్రం ఆ వ్యూహం బెడిసికొట్టింది. పరిస్థితులకు తగ్గట్టు ఆడకుండా దూకుడుగా ఆడటమే ఆ జట్టు కొంపముంచిందని ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇప్పటివరకు బజ్‌బాల్ అంటే దూకుడుగా ఆడటం అని క్రికెట్ అభిమానులు అనుకున్నారు. ఆ దేశ క్రికెటర్లు సైతం పలు సందర్భాల్లో అదే విధంగా నిర్వచించారు. టెస్టు క్రికెట్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడటం ఈ ఫార్మాట్ శైలి. అయితే, పరిస్థితులతో సంబంధం లేకుండా దూకుడుగా ఆడటమే బజ్‌బాల్ విధానం. అయితే, తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ‘బజ్‌బాల్’కు కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఐదో టెస్టు ఓటమి అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. జట్టుగా, ఆటగాడిగా మెరుగవ్వడమే బజ్‌బాల్ అర్థం అని చెప్పాడు. ‘మెరుగైన జట్టుగా, మెరుగైన ఆటగాళ్లుగా మారడానికి ఈ సిరీస్‌ను స్ఫూర్తిగా తీసుకుంటాం. మేము మెరుగైన జట్టు చేతిలో ఓడిపోయాం. బజ్‌బాల్ అంటే ఏంటని తరుచుగా మమ్మల్ని అడుగుతుంటారు. దాని అర్థం జట్టుగా, ఆటగాడిగా మెరుగవ్వడమే.’ అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.