రెండో టెస్టులో భారత్‌తో తలపడే ఇంగ్లాండ్ జట్టు ఇదే

భారత్‌తో రెండు టెస్టు కోసం తమ తుది జట్టును ఇంగ్లాండ్ గురువారం ప్రకటించింది.

Update: 2024-02-01 13:57 GMT

దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టు విజయంతో ఇంగ్లాండ్ జోష్ మీద ఉన్నది. మొదటి రెండు రోజులు భారత్ ఆధిపత్యమే కొనసాగినా.. అనూహ్యంగా పుంజుకున్న ఇంగ్లాండ్ మరో రోజు మిగిలి ఉండగానే తొలి టెస్టును దక్కించుకుంది. ఓలీ పోప్ భారీ సెంచరీకితోడు అరంగేట్రం స్పిన్నర్ టామ్ హార్ట్లీ భారత బ్యాటర్లను బెంబేలెత్తించడంతో ఇంగ్లాండ్ విజయం లాంఛనమైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటున్నది. ఈ నేపథ్యంలో రెండు టెస్టులో బరిలోకి దిగే తమ తుది జట్టును ఇంగ్లాండ్ గురువారం ప్రకటించింది. దాదాపు తొలి టెస్టు ఆడిన జట్టునే ఎంపిక చేసింది. అయితే, జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. మెకాలి గాయం కారణంగా స్పిన్నర్ జాక్ లీచ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌తో అతను టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు, పేసర్ మార్క్‌వుడ్‌ను ఇంగ్లాండ్ టీమ్ పక్కనపెట్టింది. అతని స్థానంలో సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను జట్టులోకి తీసుకుంది.

రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్ స్పిన్ బలాన్నే నమ్ముకుంది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నది. తొలి టెస్టులో భారత బ్యాటర్లను బంబేలెత్తించిన టామ్ హార్ట్లీ మరోసారి టీమ్ ఇండియాకు సవాల్ విసరనున్నాడు. అతనికితోడు అరంగేట్ర ప్లేయర్ షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ స్పిన్ బాధ్యతలను పంచుకుంటారు. అలాగే, గత మ్యాచ్‌లో బంతితో మెరిసిన జోరూట్ కూడా స్పిన్ దళంలో భాగంకానున్నాడు. ఇక, భారత గడ్డపై అనుభవం కలిగిన అండర్సన్ రాకతో ఇంగ్లాండ్ బలం మరింత పెరిగినట్టైంది. భారత్‌లో అతనికి ఇది 14 టెస్టు మ్యాచ్‌. ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, విశాఖపట్నంలో అతనికి ఇది రెండో టెస్టు మ్యాచ్. 2016లో తొలి మ్యాచ్ ఆడిన అతను ఆ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, తొలి టెస్టులో బౌలింగ్‌కు దూరంగా ఉన్న మీడియం పేసర్, కెప్టెన్ బెన్‌స్టోక్స్ రెండో మ్యాచ్‌లో బౌలింగ్ చేయనున్నాడు.

ఇంగ్లాండ్ జట్టు : జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, ఓలీ పోప్, జోరూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.

Tags:    

Similar News