క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. శ్రీలంక మాజీ క్రికెటర్‌పై 20 ఏళ్ల నిషేధం
శ్రీలంక మాజీ క్రికెటర్ దులీప్ సమరవీరపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) 20 ఏళ్ల పాటు నిషేధం విధించింది.
దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక మాజీ క్రికెటర్ దులీప్ సమరవీరపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) 20 ఏళ్ల పాటు నిషేధం విధించింది. క్రీడాకారిణితో అనుచిత ప్రవర్తన కారణంగా అతనిపై చర్యలు తీసుకుంది. సీఏతోపాటు స్టేట్ బోర్డులు, బిగ్ బాష్ లీగ్, మహిళల బిగ్ బాష్ లీగ్ క్లబ్స్‌తో అతను పనిచేయడానికి వీలు లేకుండా వేటు వేసింది. విక్టోరియా మహిళల జట్టుకు చాలా కాలంగా అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన సమరవీర ఈ ఏడాది మేలో ప్రమోషన్‌పై సీనియర్ కోచ్‌గా నియామకమయ్యాడు. అయితే, అదే నెలలో అతను తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
ఓ మహిళా క్రికెటర్‌తో సమరవీర దురుసుగా ప్రవర్తించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా కమిషన్ అతను సీఏ ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 2.23 నిబంధనను ఉల్లంఘంచినట్టు గుర్తించింది. సమరవీర అనుచితంగా ప్రవర్తించినట్టు వెల్లడించడంతో అతనిపై క్రికెట్ ఆస్ట్రేలియా బ్యాన్ విధించింది. ‘ఆటగాళ్లు, ఉద్యోగులందరికీ సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. వేధింపులకు గురైన సంక్షేమం మాకు ముఖ్యం.’ అని సీఏ తెలిపింది. కాగా, 1993-95 మధ్య శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన సమరవీర.. 7 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు.