ఆస్టేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన జకోవిచ్.. రోజర్ ఫెదరర్ రికార్డు సమం

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్ విజేత, పురుషుల సింగిల్స్ వరల్డ్ నం.1 నోవాక్ జకోవిచ్‌కు తిరుగులేకుండా పోయింది.

Update: 2024-01-21 17:25 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్ విజేత, పురుషుల సింగిల్స్ వరల్డ్ నం.1 నోవాక్ జకోవిచ్‌కు తిరుగులేకుండా పోయింది. 25వ గ్రాండ్‌స్లామ్ నెగ్గి అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర తిరగాలనే లక్ష్యంతో టోర్నీలోకి అడుగుపెట్టిన ఈ సెర్బియా దిగ్గజం ఆ దిశగా కీలక అడుగు వేశాడు. టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో జకో 6-0, 6-0, 6-3 తేడాతో 20వ సీడ్, ఫ్రెంచ్ ఆటగాడు అడ్రియన్ మన్నారినోను చిత్తుగా ఓడించాడు. జకో దూకుడుతో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ కేవలం గంటా 44 నిమిషాల్లోనే ముగిసింది. ఏస్‌లు, విన్నర్లతో విరుచుకుపడిన జకో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి రెండు సెట్లలో అయితే జకోకు పోటీనే లేదు. పూర్తిగా తేలిపోయిన మన్నారినో ఒక్క గేమ్‌ కూడా గెలుచుకోకపోవడం గమనార్హం.

ఇక, మూడో సెట్‌లోనూ జకో జోరే కొనసాగినా.. ఫ్రెంచ్ ప్లేయర్ కాస్త పోరాటం చేసేందుకు చూశాడు. వరుసగా 3వ, 4వ, 5వ గేమ్‌లను నెగ్గిన జకో 4-1ఆధిక్యంలోకి వెళ్లగా..మన్నారినో 6వ, 8వ గేమ్‌ల్లో సర్వీస్‌లను కాపాడుకున్నాడు. అయితే, 9వ గేమ్‌లో జకో ప్రత్యర్థి ఆట ముగించి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో జకో 17 ఏస్‌లు, 31 విన్నర్లతో చెలరేగాడు. 7 సార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేశాడు. మన్నారినో ఒక్క ఏస్, 12 విన్నర్లు మాత్రమే కొట్టాడు. అలాగే, 31 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకోవడం ద్వారా జకో అరుదైన రికార్డు నెలకొల్పాడు. గ్రాండ్‌స్లామ్స్‌లో అత్యధికసార్లు క్వార్టర్స్‌కు చేరుకున్న స్విస్ మాజీ ఆటగాడు రోజర్ ఫెదరర్(58 సార్లు) రికార్డును సమం చేశాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్‌లో 12వ సీడ్, అమెరికా ప్లేయర్ ఫ్రిట్జ్‌తో జకో తలపడనున్నాడు. 

Tags:    

Similar News