Irani Cup : రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్‌గా రుతురాజ్.. ధ్రువ్ జురెల్, యశ్ దయాల్‌కు చోటు

ఇరానీ కప్ టోర్నీలో బరిలోకి దిగే రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.

Update: 2024-09-24 14:38 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇరానీ కప్ టోర్నీలో బరిలోకి దిగే రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును వెల్లడించింది. లక్నో వేదికగా వచ్చే నెల 1 నుంచి 5 వరకు రంజీ ట్రోఫీ చాంపియన్ ముంబై‌తో రెస్ట్ ఆఫ్ ఇండియా తలపడనుంది. ఆ మ్యాచ్‌‌కు రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్‌గా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ ఎంపికయ్యాడు. అభిమన్యు ఈశ్వరన్‌ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ఎంపికైన ధ్రువ్ జురెల్, యశ్ దయాల్‌‌లకు జట్టులో చోటు దక్కింది. రెండో టెస్టులో భాగం కాకపోతేనే వీరు ఇరానీ కప్ ఆడతారని బీసీసీఐ తెలిపింది. అలాగే, సర్ఫరాజ్ ఖాన్ కూడా తుది జట్టుకు ఎంపికవ్వకపోతే ముంబై తరఫున బరిలోకి దిగుతాడని పేర్కొంది. సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్‌లను పట్టించుకోకపోవడం గమనార్హం.

యువ బ్యాటర్లు ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్‌‌లు చోటు సంపాదించారు. తెలుగు కుర్రాడు రికీ భుయ్‌ను ఎంపిక చేయగా.. తిలక్ వర్మ, నితీశ్ రెడ్డిలను పక్కనపెట్టారు. మరోవైపు, ముంబై జట్టును ప్రకటించాల్సి ఉంది. రంజీ ట్రోఫీ టైటిల్ అందించిన సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానేనే ముంబైని నడిపించనున్నట్టు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ ముంబై జట్టుకు ఆడనున్నట్టు సమాచారం.

రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్, మానవ్ సుథర్, శరాన్ష్ జైన్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్, యశ్ దయాల్, రికీ భుయ్, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్.

Tags:    

Similar News